ఫిబ్రవరి నెలలో పసందైన సినిమాల విందు
ఫిబ్రవరి నెలలో ముందుగా రాబోతున్న సినిమా 'పట్టుదల'. కోలీవుడ్ స్టార్ అజిత్ నుంచి రెండేళ్ల తర్వాత వస్తోన్న మూవీ ఇది. తమిళంలో 'విడముయార్చి'గా తెలుగులో 'పట్టుదల'గా ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదలవుతోంది.;
జనవరి నెల ముగిసింది. జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రాలలో వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' ఘన విజయాన్ని సాధిస్తే.. బాలకృష్ణ 'డాకు మహారాజ్' హిట్ అయ్యింది. ఎన్నో అంచనాలతో వచ్చిన రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' తీవ్రంగా నిరాశపరిచింది. మొత్తంగా జనవరిలో వచ్చిన మూడు పెద్ద చిత్రాలలో రెండు సినిమాలు విజయాలు సాధించాయి.
ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ముందుగా రాబోతున్న సినిమా 'పట్టుదల'. కోలీవుడ్ స్టార్ అజిత్ నుంచి రెండేళ్ల తర్వాత వస్తోన్న మూవీ ఇది. తమిళంలో 'విడముయార్చి'గా తెలుగులో 'పట్టుదల'గా ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదలవుతోంది. ఈ చిత్రంలో అజిత్ కి జోడీగా త్రిష నటించింది. ఆద్యంతం ఫారెన్ బ్యాక్‌డ్రాప్ లో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా మగిళ్ తిరుమేణి ఈ సినిమాని తెరకెక్కించాడు. అజిత్ తన సినిమాలను ప్రమోట్ చేయడు. 'పట్టుదల' విషయంలోనూ అదే జరుగుతుంది. కంటెంట్ కనెక్ట్ అయితే తెలుగు ప్రేక్షకులూ ఈ సినిమాని ఆదరించే అవకాశం ఉంది.
ఈనెలలో తెలుగు నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న మూవీ 'తండేల్'. నాగచైతన్య హీరోగా సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రచారం జోరుగా సాగుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు. 'కార్తికేయ 2' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చందూ మొండేటి డైరెక్షన్ లో వస్తోన్న మూవీ ఇది. ఫిబ్రవరి 7న 'తండేల్' రిలీజ్ కు రెడీ అవుతుంది.
మరోవైపు ఫిబ్రవరి 14న ప్రేమికులరోజును టార్గెట్ చేస్తూ పలు చిత్రాలు బాక్సాఫీస్ కి క్యూ కడుతున్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది 'లైలా'. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో నటించిన సినిమా ఇది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు కొంతమంది హీరోలు లేడీ గెటప్స్ లో అలరించిన సందర్భాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఈ సినిమాలో లేడీగా విశ్వక్ సేన్ ఎలా మెప్పిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
'క' విజయంతో మంచి ఫామ్ లో ఉన్న కిరణ్ అబ్బవరం.. ఈసారి 'దిల్ రుబా' అంటూ ఫుల్ లెన్త్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. కిరణ్ కి జోడీగా రుక్సార్ థిల్లాన్ నటిస్తుంది. ఈ చిత్రానికి విశ్వ కరుణ్ డైరెక్టర్. సామ్ సి.ఎస్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. వాలెంటైన్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14న 'దిల్ రూబా' రాబోతుంది. అయితే ఈ సినిమా ప్రచారంలో ఇంకా స్పీడు పెంచాల్సి ఉంది.
బ్రహ్మానందం, ఆయన తనయుడు గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్రహ్మా ఆనందం' కూడా ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి మంచి అప్లాజ్ వచ్చింది.
ప్రేమికుల రోజు కానుకగా హిందీ నుంచి తెలుగులోనూ అలరించడానికి సిద్ధమవుతుంది 'ఛావ'. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంపై ట్రైలర్ విడుదల తర్వాత భారీ అంచనాలు పెరిగాయి. విజువల్ స్పెక్టాకిల్‌గా ఉండబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ గా 'ఛావ' హీరోహీరోయిన్లు విక్కీ కౌశల్, రష్మిక హైదరాబాద్ లోనూ సందడి చేశారు.
ఫిబ్రవరి మూడో వారంలో సందీప్ కిషన్ 'మజాకా', బ్రహ్మాజీ 'బాపు' రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అసలు సంక్రాంతి బరిలోనే రావాల్సిన 'మజాకా' సినిమాని ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఫుల్ లెన్త్ ఎంటర్‌టైనర్‌గా 'మజాకా' రూపొందింది. ఈ మూవీలో సందీప్ కిషన్ తో పాటు రావు రమేష్ మరో కీ రోల్ లో కనువిందు చేయబోతున్నాడు. రితూ వర్మ, అన్షు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
ఆద్యంతం తెలంగాణ నేపథ్యంలో 'బలగం' తరహా ఎమోషన్స్ తో వస్తోన్న మూవీ 'బాపు'. ‘బలగం‘ ఫేమ్ సుధాకర్ రెడ్డి టైటిల్ రోల్ లో కనిపించబోతున్న ఈ మూవీలో బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్, రచ్చ రవి ప్రధాన పాత్రల్లో నటించారు. ‘బాపు: ఎ ఫాధర్ సూసైడ్ స్టోరీ‘ అంటూ సహజమైన ఎమోషన్స్ తో దయా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఫిబ్రవరి 21న ‘బాపు‘ మూవీ విడుదలకు ముస్తాబవుతుంది.
ఫిబ్రవరి నెల చివరిలో ఆడియన్స్ ను అలరించడానికి వస్తోంది ధనరాజ్ 'రామం రాఘవం'. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కొడుకుగా ధనరాజ్ నటిస్తుంటే.. తండ్రి పాత్రలో విలక్షణ నటుడు సముద్రఖని కనిపించబోతున్నాడు. ఫిబ్రవరి 28న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతుంది.