పైరసీ రాకెట్ ఛేదించిన సైబర్ పోలీసులు
టాలీవుడ్ సహా పలు భాషల భారీ చిత్రాలను పైరసీ చేసి ఆన్‌లైన్‌లో అమ్ముతున్న కీలక నిందితుడు జాన కిరణ్ కుమార్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.;
టాలీవుడ్ సహా పలు భాషల భారీ చిత్రాలను పైరసీ చేసి ఆన్‌లైన్‌లో అమ్ముతున్న కీలక నిందితుడు జాన కిరణ్ కుమార్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా చెందిన ఈ వ్యక్తి వనస్థలిపురంలో ఏసీ టెక్నీషియన్‌గా పని చేస్తూ.. పైరసీ ముఠాలతో కలిసి పనిచేస్తున్నాడు.
విడుదలైన రోజే థియేటర్‌కు వెళ్లి, జేబులో మొబైల్ కెమెరా పెట్టుకొని సినిమాను రికార్డ్ చేసి, టెలిగ్రామ్ ద్వారా తమిళ్‌ఎంవీ, మూవీరూల్జ్ వంటి వెబ్‌సైట్లకు విక్రయించేవాడు. ఒక్కో సినిమాకు రూ.30,000 నుండి రూ.40,000 వరకూ క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ డబ్బును జెబ్‌పే, కాయిన్ డీసీఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మనీకి మార్చుకున్నాడు.
ఈ పైరసీ వ్యవహారం వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు రూ.3,700 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుగు ఫిల్మ్ చాంబర్ పేర్కొంది. కిరణ్ కుమార్ ఏడాదిన్నర కాలంలో సుమారు 65 సినిమాలను పైరసీ చేసినట్లు అంగీకరించాడు. వాటిలో 'పుష్ప 2, కల్కి 2898 AD, గేమ్ చేంజర్, కన్నప్ప, తండేల్, సింగిల్, సికందర్' వంటి పలు పెద్ద చిత్రాలు ఉన్నాయి.
ఐటీఐ పూర్తి చేసిన కిరణ్ గతంలో ఏసీ టెక్నీషియన్‌గా పని చేశాడు. సోషల్ మీడియా ద్వారా పైరసీ ముఠాల లింకులను గుర్తించి, వారితో ఒప్పందం కుదుర్చుకొని నేరప్రవృత్తిలోకి అడుగుపెట్టాడు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో అతడిని పట్టుకొని రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.