100 కోట్ల దిశగా దూసుకెళ్తున్న అక్షయ్ కుమార్ చిత్రం
గణతంత్ర దినోత్సవానికి రెండు రోజుల ముందే విడుదల కావడం స్కైఫోర్స్ సినిమాకు అదనపు మైలేజ్‌ను ఇచ్చింది.;
అక్షయ్ కుమార్, వీర్ పహారియా, సారా అలీఖాన్, నిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘స్కై ఫోర్స్’ సినిమా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిషేక్ అనిల్ కపూర్, సందీప్ కేవ్లానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దేశభక్తి, ఎమోషన్‌ను హైలైట్ చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. గణతంత్ర దినోత్సవానికి రెండు రోజుల ముందే విడుదల కావడం సినిమాకు అదనపు మైలేజ్‌ను ఇచ్చింది.
‘స్కై ఫోర్స్’కు విమర్శకుల నుంచి మంచి అభిప్రాయాలు వస్తున్నాయి. ముఖ్యంగా అక్షయ్ కుమార్, వీర్ పహారియా నటనకు ప్రత్యేక ప్రశంసలు లభిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా నిలకడగా కలెక్షన్లు రాబడుతోంది. విడుదలైన ఐదో రోజు కూడా మంచి వసూళ్లను సాధించింది. మంగళవారం (డే 5) సుమారు రూ. 6.25 కోట్లను రాబట్టిందని సమాచారం. తాజా సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 78.25 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను సాధించింది.
వీకెండ్ రోజుల్లో ఈ సినిమా అద్భుతంగా ప్రదర్శన ఇచ్చింది. తొలి రోజు రూ. 13.75 కోట్లు, శనివారం రూ. 23.75 కోట్లు, ఆదివారం ఏకంగా రూ. 26.50 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ‘స్కై ఫోర్స్’ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించేందుకు మరికొద్ది దూరంలో ఉంది. రెండో వీకెండ్ ముగిసేలోపే ఈ మైలురాయిని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.