‘తుంబాడ్’ డైరెక్టర్ తో శ్రద్ధా కపూర్ ?
తుంబాడ్ సినిమాతో ఆకట్టుకున్న డైరెక్టర్ రాహుల్ అనీల్ బార్వా… శ్రద్ధాను నాయికగా తీసుకుని ఓ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ప్లాన్ చేస్తున్నాడట.;
బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు శ్రద్ధా కపూర్ కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. ఆమె నటించిన ‘స్త్రీ’ సినిమానే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. హరర్-కామెడీ జానర్లో వచ్చిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని సాధించింది. ఇప్పుడు ‘స్త్రీ 2’ తో ఆమె ఏకంగా 800 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. మోస్తరుగా మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఈ విజయంతో శ్రద్ధా స్టార్‌డమ్ మరింత పెరిగింది. ఆమె మార్కెట్ రేంజ్ రెట్టింపు కావడమే కాకుండా, పారితోషికం కూడా భారీగా పెరిగిందట.
ఈ క్రేజ్‌తో ఆమెకు కథల జోరు పెరిగింది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల కోసం కథలు సిద్ధం చేస్తున్న రచయితలు ఆమెని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తుంబాడ్ సినిమాతో ఆకట్టుకున్న డైరెక్టర్ రాహుల్ అనీల్ బార్వా… శ్రద్ధాను నాయికగా తీసుకుని ఓ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ప్లాన్ చేస్తున్నాడట. హాలీవుడ్ స్థాయిలో ఉండేలా స్క్రిప్ట్‌ను రెడీ చేశారట. కథ వినగానే శ్రద్ధా ఓకే చెప్పేసిందట.
ఈ ప్రాజెక్ట్‌కి ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ముందుకొచ్చింది. భారీ బడ్జెట్ కేటాయిస్తూ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుతున్నారు. ఇది శ్రద్ధా కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ కానుందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అంతే కాదు, ఆమెకు చెల్లిస్తున్న పారితోషికం విషయంలోనూ పెద్ద మైలు రాయి అవుతుందట. "శ్రద్ధాకు ఇస్తున్న రెమ్యునరేషన్‌తో రెండు మోస్తరు సినిమాలు తీసేయవచ్చు" అనే మాటలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి.