భారీ బాలీవుడ్ సినిమాకు సైన్ చేసిన మల్లూ బ్యూటీ
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ బాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటోంది. దక్షిణాది నటీమణులకు బాలీవుడ్‌లో పెరుగుతున్న అవకాశాల నేపథ్యంలో.. మాళవిక కూడా అక్కడ తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. ఆమె తాజాగా ఒక భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌కు సైన్ చేసినట్లు తెలుస్తోంది. దక్షిణాది నటీమణుల కోసం బాలీవుడ్‌లో పెరుగుతున్న డిమాండ్ కారణంగా.. మాళవిక మోహనన్‌ను ఆ పెద్ద ప్రాజెక్ట్‌కు తీసుకున్నారు.
ఇటీవల మాళవిక.. చియాన్ విక్రమ్ కు జోడీగా.. ‘తంగలాన్’ చిత్రంలో నటించింది. ప్రభాస్ సరసన ‘ది రాజాసాబ్’ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. ఈ సరికొత్త కాంబినేషన్‌పై సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కాకుండా.. మాళవిక ప్రస్తుతం మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి ‘హృదయపూర్వం’ షూటింగ్‌ను ప్రారంభించింది. అంతేకాక.. ఆమె సిద్ధాంత్ చతుర్వేది, రాఘవ్ జువాల్‌తో కలిసి హిందీలో ‘యుద్రా’ అనే చిత్రంలో కూడా నటించింది.
తమిళం నుంచి తెలుగు, మలయాళం నుంచి బాలీవుడ్ వరకు.. మాళవిక అనేక మంది ప్రముఖ స్టార్స్‌తో కలిసి పని చేసింది. ఆమె టాలెంట్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందుతోంది. సినిమాల ఎంపిక గురించి మాట్లాడినప్పుడు, మాళవిక ఓ సందర్భంలో, “ఇప్పుడు మంచి సినిమా ఏ భాషలో వచ్చినా.. ప్రేక్షకుల వరకు చేరుతుంది. మలయాళ చిత్రాలు తమ స్థాయిని చాటి చెబుతున్నాయి. అలాగే.. తెలుగు సినిమాలు హిందీ సినిమాలకు గట్టి పోటీనిస్తున్నాయి. ప్రస్తుతం నటీనటులకు ఇది గొప్ప సమయం” అని చెప్పింది. సో.. దక్షిణాది నటీమణుల డిమాండ్ పెరుగుతున్న ఈ సమయంలో.. మాళవిక మోహనన్ మరో పెద్ద బాలీవుడ్ చిత్రంలో భాగమవ్వనుంది.