ఆసక్తిని రేకెత్తిస్తోన్న ‘గ్రౌండ్ జీరో’ ట్రైలర్

ఇమ్రాన్ హాష్మీ పోషించిన నరేంద్రనాథ్ దూబే పాత్ర 2003లో ఘాజీ బాబా అనే అతి ప్రమాదకర ఉగ్రవాద నాయకుడిని అంతమొందించిన ఆపరేషన్‌కు నాయకత్వం వహించింది.;

By :  K R K
Update: 2025-04-07 14:41 GMT

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మీ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ వార్ డ్రామా "గ్రౌండ్ జీరో". ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. కశ్మీర్ నైపథ్యంలో సాగే ఈ ఉత్కంఠభరితమైన కథలో.. ఇమ్రాన్ హాష్మీ బీఎస్‌ఎఫ్ అధికారి నరేంద్రనాథ్ దూబే పాత్రలో అలరించనున్నాడు. ఈ చిత్రం నిజ ఘటనల ఆధారంగా రూపొందింది.

తేజస్ దేవోష్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా.. గత 50 ఏళ్ల బీఎస్‌ఎఫ్ చరిత్రలో ఉత్తమ ఆపరేషన్‌గా గుర్తించబడిన ఒక అసలైన సంఘటన ఆధారంగా రూపొందింది. ట్రైలర్‌లో ఇమ్రాన్ హాష్మీ పాత్ర చాలా అద్భుతంగా డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది.

2001లో కశ్మీర్ నేపథ్యంతో ప్రారంభమయ్యే ట్రైలర్‌లో.. ఓ అధికారి ఒక భయంకర కాల్‌ను అటెండ్ చేస్తాడు. ఈ కాల్ లోని మాటలు ఈ కథలో ఉన్న తీవ్రతను, పరిస్థితుల సంక్లిష్టతను స్పష్టంగా తెలియజేస్తాయి. ముజాహిద్‌లు కశ్మీర్‌కు స్వేచ్ఛ తెచ్చే ప్రయత్నాలు చేస్తుండగా, ఇమ్రాన్ హాష్మీ పాత్ర అక్కడి యువతను గుండె గాయాల నుంచి బయటపడేసి.. గందరగోళ మార్గాలనుంచి వారిని మంచి మార్గానికి తీసుకురావడంలోనూ కీలకపాత్ర పోషిస్తాడు.

ఇమ్రాన్ హాష్మీ పోషించిన నరేంద్రనాథ్ దూబే పాత్ర 2003లో ఘాజీ బాబా అనే అతి ప్రమాదకర ఉగ్రవాద నాయకుడిని అంతమొందించిన ఆపరేషన్‌కు నాయకత్వం వహించింది. ఇందుకు గాను ఆయనకు 2005లో కిర్తి చక్ర అవార్డును ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా లభించింది.

ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రం తీవ్రతతో కూడిన యాక్షన్, భావోద్వేగాలతో నిండిన కథనాన్ని ఆవిష్కరిస్తుంది. రితేష్ సిద్వాని, ఫర్హాన్ అఖ్తర్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో సాయి తామ్హాంకర్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇటీవ‌లే ఇమ్రాన్ హాష్మీ... సల్మాన్ ఖాన్‌ నటించిన "టైగర్ 3" చిత్రంలో ప్రతినాయకుడు ఆతిష్ రెహమాన్ పాత్రలో నటించి మెప్పించాడు. త్వరలో ఆయన "గూఢచారి 2", "ఆవారాపన్ 2" సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు.

Tags:    

Similar News