వాయిదా పడిన ‘స్పైడర్ మ్యాన్ 4’ విడుదల

Update: 2025-02-24 06:30 GMT

‘స్పైడర్ మ్యాన్’ అభిమానులు టామ్ హాలండ్ నటించిన ‘స్పైడర్ మ్యాన్ 4’ కోసం మరికొంత కాలం ఎదురుచూడాల్సి వస్తోంది. సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని 2026, జూలై 31న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ మూవీ ఇంతకు ముందు ప్రకటించిన తేదీ కంటే వారం రోజులు లేట్ గా రాబోతోంది. ‘శాంగ్-చీ అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్’ సినిమాను తెరకెక్కించిన డెస్టిన్ డానియెల్ క్రెట్టన్ ఈ సీక్వెల్‌కు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 2021లో విడుదలైన ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ కు ఇది కొనసాగింపు చిత్రంగా రానుంది.





 


ఎరిక్ సోమర్స్, క్రిస్ మెక్‌కెన్నా ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. మొదటగా ‘స్పైడర్ మ్యాన్ 4’ 2026లో క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న ‘ది ఓడిస్సీ’ విడుదలైన వారంలోనే థియేటర్లలోకి వదలాలి అనుకున్నారు. అయితే హోమర్ రచించిన పురాతన గ్రీకు కావ్యానికి ఆధునిక రూపం కల్పించిన ఈ మైథలాజికల్ యాక్షన్ ఎపిక్‌లో టామ్ హాలండ్, మ్యాట్ డేమన్ , అన్న హాతవే, జెండాయా, లుపితా న్యోంగో, రాబర్ట్ ప్యాటిన్‌సన్, చార్లీజ్ థెరాన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే, బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాల మధ్య పోటీ తగ్గించేందుకు సోనీ పిక్చర్స్ ‘స్పైడర్ మ్యాన్ 4’ విడుదల తేదీని వాయిదా వేసింది.

టామ్ హాలండ్ నటించిన ‘స్పైడర్ మ్యాన్ హోమ్‌కమింగ్’ , ‘స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రం హోమ్’ , ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ వంటి మూడు చిత్రాలకు జాన్ వాట్స్ దర్శకత్వం వహించారు. ఈ మూడూ ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందనను అందుకుని భారీ విజయాలు సాధించాయి. ‘స్పైడర్ మ్యాన్ 4’ ఇప్పుడు పా ప్యాట్రోల్ 3 సినిమాతో పోటీ పడనుంది. ఈ ప్రాజెక్టుకు అమీ పాస్కల్, మార్వెల్ స్టూడియోస్ అధ్యక్షుడు కెవిన్ ఫైగీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో జెండాయా ఫీమేల్ లీడ్ పాత్రను పోషిస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇతర నటీనటుల వివరాలు కూడా వెల్లడించలేదు.

Tags:    

Similar News