సందీప్ రెడ్డి వంగా సినిమాలకు ప్రత్యేకమైన భాష ఉంది : అర్జున్ కపూర్
రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ సినిమాను అద్భుతమైన చిత్రంగా అభివర్ణించిన అర్జున్, ఆ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, అంశాలను విశేషంగా ప్రశంసించాడు.;
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఇటీవల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆయన సినిమాల్లో కనిపించే ప్రత్యేకమైన దృశ్య భాష, ఆడియో కట్టింగ్, విజువల్ ఫ్రేమింగ్ ను అతడు తెగ మెచ్చుకున్నాడు. రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ సినిమాను అద్భుతమైన చిత్రంగా అభివర్ణించిన అర్జున్, ఆ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, అంశాలను విశేషంగా ప్రశంసించాడు.
ఒక ఇంటర్వ్యూలో అర్జున్ మాట్లాడుతూ.. వంగా దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి చూసిన తర్వాత తాను పూర్తిగా మైమరచిపోయానని చెప్పాడు. ఒక దర్శకుడు తనే డైలాగ్స్ రాయడం చాలా ఆసక్తికరమైన విషయం. సందీప్ వంగా డైలాగ్స్ ఎప్పుడూ నేరుగా పాయింట్‌కి వస్తాయి. పక్కా భావాన్ని వినిపిస్తాయి అన్నాడు.
"మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు భాష లేదనేది తప్పుమాట. నేను ఇటీవల సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ చూశాను. ఆయనకు తనదైన శైలి ఉంది. ఆడియో కట్టింగ్ ప్యాటర్న్, విజువల్ కట్టింగ్ ప్యాటర్న్, ఫ్రేమింగ్.. ఇలా అన్నిటికీ ఒక ప్రత్యేకమైన భాష ఉంది. మైన్‌స్ట్రీమ్ సినిమాల్లో కూడా భాష ఉంటుంది," అని అర్జున్ కపూర్ చెప్పాడు.
తనకు గతంలో హిందీ సినిమాల్లో హీరోతో పోరాడే విలన్స్‌కు ఎలాంటి వ్యక్తిత్వం ఉండదన్న భావన ఉండేదని అర్జున్ చెప్పాడు. అయితే ‘యానిమల్’ సినిమాలో విలన్స్‌కి వంగా వేసిన మాస్కులు వాళ్లను మరింత భయానకంగా చూపించాయని అన్నారు. "ఆ మాస్కుల ద్వారా వాళ్లను చాలా మెనేసింగ్‌గా మార్చారు. అది చిన్న ఐడియాలా కనిపించినా, చాలా బలమైన ప్రభావం చూపింది," అన్నాడు.
సందీప్ రెడ్డి వంగా కథను రాయడం మొదలుకుని... దానికి సరిపోయే దృశ్య భాషను అందించడంలో, ప్రతీ చిన్న విషయాన్ని నాణ్యంగా మలచడంలో ప్రత్యేకతను చూపుతున్నారని అర్జున్ కపూర్ స్పష్టంగా పేర్కొన్నాడు. వంగా సినిమాల్ని ఒక ప్రత్యేక శైలి అయిన కొత్త భాషగా ఆయన అభివర్ణించడం అభిమానులకు మరింత ఆసక్తికరంగా మారింది.