సెన్సార్ బోర్డుపై అనురాగ్ ఆగ్రహం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తీసుకుంటున్న నిర్ణయాలపై సినీ ఇండస్ట్రీ నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.;

By :  S D R
Update: 2025-07-17 11:54 GMT

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తీసుకుంటున్న నిర్ణయాలపై సినీ ఇండస్ట్రీ నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మలయాళ చిత్రం ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడంపై దర్శకులు, నటులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో కథానాయిక పాత్ర పేరు ‘జానకి’గా ఉండటంతో, అది సీతాదేవికి మరో పేరు అన్న అభిప్రాయంతో సెన్సార్ బోర్డు ఆ పేరును మార్చాలని కోరింది. ఈ నిర్ణయంపై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తీవ్రంగా స్పందించారు. 'పాత్రలకు పురాణాల్లోని పేర్లు పెట్టవద్దనడం విడ్డూరంగా ఉంది. ఇలాగే అయితే పాత్రలకు XYZ, 123 అని పేర్లు పెట్టాలా?' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అనురాగ్ మాట్లాడుతూ, 'నిజాయితీగా కథ చెప్పడమే ముఖ్యం. సినిమాలు నైతిక పాఠాలు చెప్పడానికి కాదు. సెన్సార్ బోర్డు ఇలాంటి ఆంక్షలు పెట్టడం వల్ల ఎన్నో మంచి కథలు ప్రేక్షకుల ముందుకి రావడం లేదు' అన్నారు.

అలాగే, సెన్సార్ బోర్డులో భాషా అవగాహన లోపాలు ఉన్నాయని తెలిపారు. తాను పనిచేసిన ‘సత్య’ సినిమా సమయంలో, ఒక హిందీ పదానికి సభ్యులు తప్పుగా అర్థం పెట్టుకుని అభ్యంతరం చెప్పారు. దాంతో డిక్షనరీ తీసుకెళ్లి వివరణ ఇవ్వాల్సి వచ్చిందని వెల్లడించారు. 'ఇప్పుడు ఫోన్ కూడా లోపలికి అనుమతించడం లేదు. విషయాన్ని ఎలాగ వివరించాలి?' అని ప్రశ్నించారు. సినిమా స్వాతంత్ర్యాన్ని కాపాడాలంటే, సెన్సార్ వ్యవస్థ పునర్నిర్మాణం అవసరమని అనురాగ్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News