వేతనాలపై పరిష్కారం ఎక్కడ?
తెలుగు సినిమా పరిశ్రమలో వేతనాల అంశంపై పెద్ద కలకలం రేగుతోంది. ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన ఇప్పటికే 13 రోజులు దాటింది.;
తెలుగు సినిమా పరిశ్రమలో వేతనాల అంశంపై పెద్ద కలకలం రేగుతోంది. ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన ఇప్పటికే 13 రోజులు దాటింది. కార్మికులు తమ న్యాయమైన వేతనాల కోసం పోరాటం చేస్తుండగా, నిర్మాతలు మాత్రం చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్మాతలు బహిరంగంగా 'మేము ఒప్పుకోవడం లేదు' అంటూ మాట్లాడుతూనే, మీడియా ముందు కార్మికులు స్పందించవద్దని మరోవైపు షరతులు పెడుతున్నారని ఆయన అన్నారు. 'మేము గత మూడు రోజులుగా మీడియా ముందు మాట్లాడటం మానేశాం. అయినప్పటికీ నిర్మాతలు కొత్త కొత్త షరతులు పెడుతూ, ఎక్కడ లేని పాయింట్లు చర్చలోకి లాగుతున్నారు' అని అనిల్ అన్నారు.
50 ఏళ్లుగా లేని కండిషన్లను ఇప్పుడు పెట్టడం ద్వారా సమస్యను మరింత క్లిష్టం చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. అయితే నిర్మాతల పరిస్థితి కూడా సులభం కాదని అర్థం చేసుకుంటున్నామని, అందుకే కొంతవరకు తాము కూడా దిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఇక చర్చల విషయానికి వస్తే, 'మేము ఎప్పుడూ చర్చలకు సిద్ధమే. కానీ నిర్మాతలెవరూ అందుబాటులోకి రావడం లేదు. ఛాంబర్, కౌన్సిల్ నిర్ణయాలు వచ్చిన తర్వాత మా తదుపరి కార్యచరణ ప్రకటిస్తాం' అని అనిల్ కుమార్ తెలిపారు.