‘ఓజీ’లో ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ విడుదల
పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ అవతారానికి జోడీగా ప్రియాంక - సుజీత్ యాక్షన్ కథనానికి భావోద్వేగాన్ని జోడిస్తున్న హీరోయిన్ పాత్ర;
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు, పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఓజీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఓజాస్‌గా కనిపించబోతుండగా, హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు.
తాజాగా చిత్రబృందం ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె ‘కన్మణి’ అనే పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు సినిమాకి గట్టి యాక్షన్ టచ్ ఇస్తే, ప్రియాంక ఫస్ట్ లుక్ మాత్రం వేరే కోణాన్ని చూపిస్తోంది. ఒక పోస్టర్‌లో సున్నితమైన భావం, నిశ్శబ్దం కనిపిస్తే, మరో పోస్టర్‌లో ఇంటి వాతావరణం, ప్రశాంతత కనిపిస్తోంది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ లుక్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకుల మనసు దోచేస్తోంది. దర్శకుడు సుజీత్ రగిలించే యాక్షన్ కథనానికి, ప్రియాంక పాత్ర ఓ భావోద్వేగ లోతు, సౌమ్యతను జోడిస్తోందని నిర్మాతలు చెబుతున్నారు. “తుఫాన్‌లో ఉండే శాంతిలా ప్రియాంక పాత్ర ఉంటుంది” అని వారు పేర్కొన్నారు.ఇటీవల విడుదలైన ‘ఫైర్‌స్టార్మ్’ పాటకు మంచి స్పందన వచ్చింది. త్వరలో రెండో పాట ప్రోమో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్‌తో పాటు ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం ఎస్. తమన్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస కలిసి నిర్వహిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలు నవీన్ నూలి చూసుకుంటున్నారు.
భారీ అంచనాలు నెలకొల్పుకున్న ‘ఓజీ’ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.