థియేటర్లలో రేపటి పండుగ
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మళ్లీ వరుస సినిమాల సందడి నెలకొనబోతుంది. రేపు తెలుగు నుంచి 'కుబేర, 8 వసంతాలు' చిత్రాలు, హిందీ నుంచి అనువాద రూపంలో 'సితారే జమీన్ పర్' చిత్రం.. మొత్తంగా మూడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.;
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మళ్లీ వరుస సినిమాల సందడి నెలకొనబోతుంది. రేపు తెలుగు నుంచి 'కుబేర, 8 వసంతాలు' చిత్రాలు, హిందీ నుంచి అనువాద రూపంలో 'సితారే జమీన్ పర్' చిత్రం.. మొత్తంగా మూడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.
చాలా రోజుల తర్వాత థియేటర్లలోకి వస్తోన్న స్టార్ మూవీ అంటే 'కుబేర' అని చెప్పొచ్చు. నాగార్జున-ధనుష్ కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో 'కుబేర'గా టైటిల్ రోల్ లో ధనుష్ కనిపించినా.. నాగార్జున పాత్ర కూడా సినిమాకి ఎంతో కీలకంగా ఉంటుందట. హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక నటించింది. ఇతర కీలక పాత్రలో జిమ్ సర్బ్ కనిపించబోతున్నాడు.
'కుబేర' చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి 'నా కొడుకా' అంటూ సాగే మరో ఎమోషనల్ సాంగ్ రిలీజయ్యింది. బిచ్చగాడు పాత్రలో ధనుష్ పై చిత్రీకరించిన ఈ గీతం ఆకట్టుకుంటుంది. శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా 'కుబేర' చిత్రాన్ని నిర్మించాయి. 'కుబేర' చిత్రాన్ని తెలుగు, తమిళంలలో సైమల్టేనియస్ గా తెరకెక్కించారు.
రేపు విడుదలవుతోన్న చిత్రాలలో '8 వసంతాలు' ఒకటి. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వస్తోన్న సినిమా ఇది. 'మ్యాడ్' ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ప్రేమకథా చిత్రానికి ఫణీంద్ర నార్సెట్టి దర్శకుడు. ఓ డిఫరెంట్ లవ్ స్టోరీగా '8 వసంతాలు' ఆడియన్స్ ముందుకు వస్తోంది. మలయాళీ మ్యూజికల్ సెన్సేషన్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతంలోని పాటలకు మంచి పేరొచ్చింది.
రేపు బాలీవుడ్ నుంచి రాబోతున్న బడా మూవీ 'సితారే జమీన్ పర్'. అమిర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ 'తారే జమీన్ పర్'కి సీక్వెల్ గా ఈ చిత్రం వస్తోంది. ఈ సినిమాలో మరో ఎమోషనల్ స్టోరీతో ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధమయ్యాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పై ఆర్.ఎస్.ప్రసన్న దర్శకత్వం వహించిన 'సితారే జమీన్ పర్' తెలుగులోనూ విడుదల కాబోతుంది.