బాలీవుడ్‌లో టాలీవుడ్ భామల హవా!

Update: 2025-01-15 09:20 GMT

టాలీవుడ్ మేకర్స్ బాలీవుడ్ హీరోయిన్లకు రెడ్ కార్పెట్ వేయడం అలవాటుగా మారింది. కానీ ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాల హవా హిందీ మార్కెట్‌లో పెరుగుతోంది. ఈ ప్రభావంతో దక్షిణాది భామల్ని ఎక్కువగా ఎంపిక చేస్తున్నారు బాలీవుడ్ దర్శక, నిర్మాతలు.

రీసెంట్ గా మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తూ తన మొట్ట మొదటి చిత్రం గా "బేబీ జాన్" లో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, మరికొందరు సౌత్ భామలు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

శ్రీలీల ఈ ఏడాది బాలీవుడ్‌లో తన మొదటి చిత్రం చేయడం ఖాయం గా కనబడుతోంది. సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ఇప్పటికే శ్రీలీల, ఇబ్రహీం కలిసి ఫోటోషూట్ పూర్తి చేశారు. "పుష్ప 2"లో ఆమె చేసిన "కిస్సిక్" ఐటెం సాంగ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో విజయవంతమైంది. ఈ విజయంతో బాలీవుడ్ మేకర్స్ ఆమెపై దృష్టి పెట్టారు.

సాయిపల్లవి కూడా బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అంతేకాదు, సాయిపల్లవి రణబీర్ కపూర్ సరసన "రామాయణం"లో సీతగా నటిస్తోంది. రణబీర్ రాముడిగా కనిపించనున్నారు. ఈ భారీ చిత్రం బాలీవుడ్‌లో భారీ అంచనాలను అందుకుంటోంది.

ఇప్పటికే రష్మిక మందాన బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ గా స్థిరపడింది. "యానిమల్", "పుష్ప 2" వంటి భారీ విజయాల తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన "సికిందర్" అనే సినిమాలో నటిస్తోంది. అలాగే విక్కి కౌశల్ సరసన "చావా" అనే చిత్రాన్ని కూడా పూర్తి చేసింది.

సౌత్ హీరోయిన్ల హవా బాలీవుడ్‌లో కొనసాగుతుండటం తో, త్వరలో మరికొందరు దక్షిణాది భామలు హిందీ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టడం ఖాయం.

Tags:    

Similar News