'సుందరకాండ' రివ్యూ
'ప్రతినిధి 2, భైరవం' చిత్రాల తర్వాత నారా రోహిత్ నుంచి వచ్చిన చిత్రం 'సుందరకాండ'. ఈ సినిమాలో నారా రోహిత్ సరసన వృతి వాఘాని హీరోయిన్ గా నటించింది. శ్రీదేవి విజయ్ కుమార్ మరో కీలక పాత్రలో కనిపించింది. మరి.. ఈ సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.;
నటీనటులు: నారా రోహిత్, శ్రీదేవి, వృతి వాఘాని, నరేష్, సత్య, సునైనా, అభినవ్ గోమఠం, వాసుకి, రూపలక్ష్మి తదితరులు
సినిమాటోగ్రఫీ: ప్రదీష్ వర్మ
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటింగ్ : రోహన్ చిల్లలే
నిర్మాతలు: సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి
దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి
విడుదల తేది: ఆగస్టు 27, 2025
'ప్రతినిధి 2, భైరవం' చిత్రాల తర్వాత నారా రోహిత్ నుంచి వచ్చిన చిత్రం 'సుందరకాండ'. ఈ సినిమాలో నారా రోహిత్ సరసన వృతి వాఘాని హీరోయిన్ గా నటించింది. శ్రీదేవి విజయ్ కుమార్ మరో కీలక పాత్రలో కనిపించింది. మరి.. ఈ సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
సిద్దార్థ్ (నారా రోహిత్) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మూడు పదుల వయసు దాటినా పెళ్లి జరగదు. కారణం అతని మనసులో చిన్నప్పటి నుండి మిగిలిపోయిన ఒక కోరిక. స్కూల్‌లో తన సీనియర్ వైష్ణవి (శ్రీదేవి)లో చూసిన ఐదు ప్రత్యేక లక్షణాలు అతన్ని జీవితాంతం ఆకర్షిస్తాయి. అలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న సిద్దార్థ్ వచ్చిన ప్రతి సంబంధాన్ని తిరస్కరిస్తూ ఉంటాడు.
ఇలాంటి సమయంలో అనుకోకుండా ఐరా (వృతి వాఘాని)ని కలుస్తాడు. ఆమెలో తనకు కావలసిన లక్షణాల్లో కొన్ని కనిపించడంతో, మిగిలినవి ఉన్నాయా అని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ వెతుకులాటలోనే ఆమెను దగ్గరగా తెలుసుకుంటాడు. ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నా, ఐరాలో తనకు కావలసిన ఐదు లక్షణాలు ఉన్నాయని నమ్మిన సిద్దార్థ్ ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. మొదట ఐరా నిరాకరించినా, సిద్దార్థ్ తన ఉద్యోగాన్ని వదిలి ఆమె చదువుతున్న కాలేజీలోనే లెక్చరర్‌గా చేరి తన ప్రేమను నిరూపించుకుంటాడు. చివరికి ఆమె కూడా అతని ప్రేమను అంగీకరిస్తుంది.
అయితే ఇక్కడ కథ కొత్త మలుపు తిరుగుతుంది. సిద్దార్థ్ – ఐరా ప్రేమ సాగుతుండగా అనుకోకుండా వైష్ణవి మళ్లీ ప్రవేశిస్తుంది. ఆమె ఎవరు? వైష్ణవి – ఐరా మధ్య ఉన్న సంబంధం ఏమిటి? సిద్దార్థ్ ఊహించని ఆ షాకింగ్ నిజం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం సినిమాలో దొరుకుతుంది.
విశ్లేషణ
ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఎక్కువగా యాక్షన్, సస్పెన్స్ సినిమాలు వరుసగా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'సుందరకాండ'. సాధారణమైన కథనాన్ని తీసుకుని, వల్గారిటీకి తావు ఇవ్వకుండా, సున్నితమైన అంశాన్ని జాగ్రత్తగా డీల్ చేస్తూ దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి కథను తీర్చిదిద్దిన విధానాన్ని మెచ్చుకోవాలి.
కథలో ఉన్న సున్నితమైన కాన్‌ఫ్లిక్ట్‌ను దర్శకుడు చాలా తెలివిగా, హద్దులు దాటకుండా డీల్ చేశాడు. ముఖ్యంగా స్కూల్ ఎపిసోడ్‌లో రామాయణ నాటకాన్ని చూపిస్తూ, సిద్ధార్థ్ ఆంజనేయుడి వేషంలో ఉండి వైష్ణవికి ఉంగరం ఇచ్చే సన్నివేశం – మొత్తం కథ ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా నిలిచింది. కొన్ని రొటీన్ సీన్స్ ఉన్నా, స్కూల్ ఎపిసోడ్ బాగుంది. ఐరా ఎంట్రీతో వేగం పెరిగింది. సత్య కామెడీ బాగా నడిపించింది. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎమోషనల్‌గా బాగా పనిచేశాయి.
సినిమాలోని మైనస్ ల విషయానికొస్తే కథనం ఆసక్తికరంగా కొనసాగినా కొంచెం సాగదీసిన ఫీల్ వచ్చింది. సినిమాలో కాన్‌ఫ్లిక్ట్ స్ట్రాంగ్‌గా అనిపించదు. ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులు ముందుగానే ఊహించగలిగేలా ఉంటుంది. ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత అసలు పాయింట్ ఎప్పుడు వస్తుందా? అన్నట్లుగా కొంతసేపు ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
నారా రోహిత్ సిద్ధార్థ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. డైలాగ్ డెలివరీ, ఫైట్స్ అన్నింటిలోనూ ఇరగదీశాడు. హీరోయిన్‌గా వృతి వాఘాని అందం, అభినయంతో ఆకట్టుకుంది. శ్రీదేవి చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనబడింది. అయినా ఆ ఛార్మ్ తగ్గలేదు. ఈ సినిమాలో సత్య కామెడీ ట్రాక్ హైలైట్. హీరో అక్కగా వాసుకి మెప్పించింది. నరేష్, అభినవ్ గోమటం తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ విషయానికొస్తే.. సినిమా సాంకేతిక అంశాల పరంగా బాగా నిలబడింది. లియోన్ జేమ్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని చెప్పాలి. కొన్ని ట్యూన్స్ ఎక్కడో విన్న భావన కలిగించినా, సినిమా మొత్తాన్ని ప్లెజెంట్ ఫీలింగ్‌తో ముందుకు తీసుకెళ్లడంలో మంచి పాత్ర పోషించాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ ఎంతో ఆకట్టుకునేలా ఉంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా ఉండటంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాయి. హీరో, హీరోయిన్ల కాస్ట్యూమ్స్ కూడా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేయబడటం మరో అదనపు ఆకర్షణ. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా
'సుందరకాండ'.. పీల్ గుడ్ స్టోరీ!