పవన్ 'ప్రాణం ఖరీదు' జ్ఞాపకాలు!
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అయితే.. సెప్టెంబర్ 22న ఆయన నటుడిగా వెండితెరపై అడుగుపెట్టిన రోజు. అంటే ఈరోజుతో చిరు చిత్ర సీమకు పరిచయమై సరిగ్గా 47 ఏళ్లయ్యింది.;
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అయితే.. సెప్టెంబర్ 22న ఆయన నటుడిగా వెండితెరపై అడుగుపెట్టిన రోజు. అంటే ఈరోజుతో చిరు చిత్ర సీమకు పరిచయమై సరిగ్గా 47 ఏళ్లయ్యింది. ఈ సందర్భంగా తమ పెద్దన్నయ్య చిరంజీవి నటించిన తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' కబుర్లను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
'నేను ఇంకా స్పష్టంగా గుర్తు పెట్టుకుంటున్నాను.. మా పెద్ద అన్నయ్య హీరోగా నటించిన 'ప్రాణం ఖరీదు' సినిమా చూసిన రోజును. ఆ సమయంలో మేము నెల్లూరులో ఉన్నాము. నేను అప్పుడే స్కూల్‌లో చదువుతున్నా. మేము కనకమహాల్ థియేటర్‌కి వెళ్లి ఆ సినిమా చూసినప్పుడు కలిగిన ఆనందం, ఉల్లాసం వర్ణనాతీతం.
ఆ తరువాత నుంచి ఆయన సినీ ప్రయాణం నేటి వరకు 47 ఏళ్లుగా సాగుతోంది. ప్రతీ దశలో ఆయన ఎత్తులు ఎక్కుతూ, తన ప్రతిభతో, కృషితో, వినయంతో నడుస్తూ వచ్చిన తీరు నిజంగా ప్రేరణ కలిగించేది. ఎంత ఎత్తుకి ఎదిగినా ఆయన మనసులోని ఆ సాదాసీదా స్వభావం, సేవా భావం ఎప్పటికీ మారలేదు.
దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనతో ఉండాలని, ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇకపై కూడా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో ఆయనను చూసే అదృష్టం మాకు కలగాలి. ఆయనకు 'రిటైర్మెంట్' అనే పదమే ఉండదు.. అది ఆయనకి నచ్చితే తప్ప. ఆయన స్వభావం తెలిసిన మనకు ఆ రోజు ఎప్పటికీ రాదని నమ్మకం. జన్మతః యోధుడైన నా పెద్ద అన్నయ్య, మనందరికీ ప్రియమైన శంకర్ బాబు.. అదే మన మెగాస్టార్ చిరంజీవి!' అని పవన్ తన అన్నయ్య మెగాస్టార్ తొలి సినిమా విశేషాలను పంచుకున్నారు.