'ఓజీ' రివ్యూ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘ఓజీ’. రీఎంట్రీలో 'హరిహర వీరమల్లు' నిరాశపరచడంతో పవర్ ఫ్యాన్స్ అంతా 'ఓజీ'పైనే ఆశలు పెట్టుకున్నారు. మరి.. ఆ అంచనాలను 'ఓజీ' అందుకున్నాడా? ఈ రివ్యూలో చూద్దాం.;

By :  S D R
Update: 2025-09-25 00:58 GMT

నటీనటులు: పవన్‌ కళ్యాణ్‌, ఇమ్రాన్‌ హష్మీ, ప్రియాంక మోహన్‌, ప్రకాశ్‌ రాజ్‌, శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌, సుదేవ్‌ నాయర్‌, రాహుల్‌ రవీంద్రన్‌ తదిరులు

సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్‌, మనోజ్‌ పరమహంస

సంగీతం: తమన్‌ ఎస్‌

ఎడిటింగ్ : నవీన్‌ నూలి

నిర్మాతలు: డి.వి.వి. దానయ్య, కళ్యాణ్‌ దాసరి

దర్శకత్వం: సుజీత్‌

విడుదల తేది: సెప్టెంబర్ 25, 2025

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘ఓజీ’. రీఎంట్రీలో 'హరిహర వీరమల్లు' నిరాశపరచడంతో పవర్ ఫ్యాన్స్ అంతా 'ఓజీ'పైనే ఆశలు పెట్టుకున్నారు. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ఆ అంచనాలను 'ఓజీ' అందుకున్నాడా? ఈ రివ్యూలో చూద్దాం.

కథ

జపాన్‌లో జరిగిన ఒక దాడి నుంచి తప్పించుకున్న ఓజాస్ గంభీర (పవన్ కళ్యాణ్) ఇండియాకు బయలుదేరతాడు. ఓడలో సత్యాలాల్‌ అలియాస్ సత్యదాదా (ప్రకాశ్ రాజ్) ప్రాణాలు కాపాడతాడు. దాంతో ఓజీని బొంబాయి తీసుకెళ్లి, తనతో పాటు అండర్‌వరల్డ్‌లో కుడిభుజంగా నిలబెడతాడు సత్యదాదా. అక్కడ ఒక పోర్ట్‌ను తన ఆధీనంలో ఉంచుకొని డాన్‌గా ఎదుగుతాడు సత్యదాదా.

అయితే అనుకోని పరిస్థితుల్లో ఓజీ బొంబాయి వదిలి వెళ్లిపోతాడు. తర్వాత డాక్టర్ కన్మణి (ప్రియాంక అరుల్ మోహన్)ని పెళ్లి చేసుకొని నాసిక్‌లో కొత్త జీవితం మొదలుపెడతాడు. ఇదే సమయంలో సత్యదాదా పాత స్నేహితుడు, ఇప్పుడు శత్రువైన మిరాజ్‌కర్ (తేజ్ సప్రూ) కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మీ) ముంబై అండర్‌వరల్డ్‌పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తారు.

జిమ్మీ సత్యదాదా కొడుకును చంపేస్తాడు. ఓమీ ఇస్తాంబుల్‌ నుంచి వచ్చి పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవడానికి దారుణంగా దాడులు చేస్తాడు. ఇద్దరు కొడుకులను కోల్పోయిన సత్యదాదా మళ్లీ ఓజీని ఆశ్రయించాల్సి వస్తుంది. అప్పుడు ఓజీ తిరిగి బొంబాయిలో అడుగుపెడతాడు. సత్యదాదా, మిరాజ్‌కర్ మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి? ఓజీ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది? వంటివి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ

దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ అభిమాని. ఆ అభిమానం తెరపై బాగా కనిపించింది. కథ పరంగా కొత్తదనం లేకపోయినా, పవన్ స్టైల్, స్వాగ్, హీరోయిజం ఎలివేట్ చేసే సీన్స్ రాశాడు. 'ఓజీ' కథ కొత్తదేమీ కాదు. మాఫియా – గ్యాంగ్‌స్టర్ ట్రాక్‌ని ఎంచుకున్నా, సుజీత్‌ దానిని పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ప్రెజెంట్ చేశాడు. కథ కంటే హీరో ఎలివేషన్లపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడంతో స్క్రీన్ మీద పవన్ కనిపించే ప్రతి సీన్ ఫ్యాన్స్‌కి హై ఇచ్చింది.

జపాన్‌లో మొదలైన కథ ముంబై వరకు సాగుతుంది. హీరో ఎంట్రీ ఆలస్యమైనా, పవన్ ఇంట్రడక్షన్ ఫైట్‌ నుంచి ఇంటర్వెల్ వరకూ ప్రతి యాక్షన్ బ్లాక్ గూస్‌బంప్స్ తెప్పించేలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ పవన్ కెరీర్‌లో బెస్ట్ సీన్‌గా నిలుస్తుంది.

ప్రతి పది నిమిషాలకు ఓ హై సీన్ పెట్టి, పవన్‌ స్వాగ్‌ని మాక్స్‌లో చూపించాడు సుజీత్‌. ‘జానీ, ఖుషీ, బద్రి’ రిఫరెన్స్‌లు, స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్.. ఇవి పవన్ అభిమానులకు ఐఫీస్ట్‌గా మారాయి. అయితే కథలో డెప్త్ తక్కువ. ప్రేమ కథ, ఎమోషన్ కాస్త బలహీనంగానే కనిపించాయి. క్లైమాక్స్ కూడా హడావిడిగా ముగిసినట్టే అనిపిస్తుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' క్యారెక్టర్ లో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు. నాన్‌చాక్ ఫైట్, క్లైమాక్స్‌లో ‘జానీ’ అనే ఆయుధం వాడటం ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్‌ తెప్పించే హైలైట్స్. మొత్తానికి ఓజస్ గంభీర పాత్రలో పవన్ కళ్యాణ్ ఎమోషన్, యాక్షన్ రెండు రకాలలోనూ దుమ్ముదులిపేశాడు. ప్రియాంక మోహన్ ‘కన్మణి’ పాత్రలో ఫ్రెష్ లుక్‌తో మెప్పించింది.

ఇమ్రాన్ హష్మీ స్టైలిష్ విలన్‌గా బాగా ఆకట్టుకున్నాడు. ప్రకాష్ రాజ్ సత్యదాదాగా ఆకట్టుకున్నాడు. ఆయనకు అలాంటి తరహా పాత్రలు కొట్టినపిండే. శ్రియారెడ్డి పౌరుషానికి ప్రతీకలా గీత పాత్రలో మెప్పించింది. తేజ్ సప్రూ మరో ప్రతినాయకుడిగా ఇంప్రెస్ చేశాడు. అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, సుదేవ్ నాయర్, ‘కిక్’ శ్యామ్, శుభలేఖ సుధాకర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

'ఓజీ' సినిమాకు మంచి టెక్నికల్ టీమ్ కుదిరింది. దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్‌ను కొత్త స్వాగ్, స్టైల్‌లో చూపించాడు. సెకండాఫ్ కొంత స్లో అయినా ఎలివేషన్స్‌తో సినిమా నడిపించాడు. తమన్ తన కెరీర్‌లోనే బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చి సినిమాకి బ్యాక్‌బోన్ అయ్యాడు. రవికె చంద్రన్, మనోజ్ పరమహంస లు అద్భుతమైన సినిమాటోగ్రఫీతో విజువల్స్‌ను మరింత ఎలివేట్ చేశారు. నవీన్ నూలీ ఎడిటింగ్ బాగుంది.

యాక్షన్ సన్నివేశాలకు ఏ విజయ్, పీటర్ హెయిన్స్, స్టంట్స్ శివ వర్క్ హైలైట్‌గా నిలిచింది. ప్రొడక్షన్ విలువల్లో నిర్మాత డీవీవీ దానయ్య ఎక్కడా రాజీ పడలేదు.

చివరగా

'ఓజీ'.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగ లాంటి సినిమా. దసరా సెలవులు ఉండటం ఈసినిమాకి ప్లస్ పాయింట్.

Telugu70MM Rating: 3.25 / 5

Tags:    

Similar News