'మిరాయ్' రివ్యూ
‘హనుమాన్’తో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ కొట్టిన తేజ సజ్జా, ఇప్పుడు మరోసారి అలాంటి పాన్ ఇండియా అప్పీల్ ఉన్న 'మిరాయ్'తో వచ్చాడు. ఈరోజు భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.;
నటీనటులు: తేజ సజ్జ, మంచు మనోజ్, రితిక నాయక్, శ్రియా శరన్, జగపతి బాబు, జైరాం, గెటప్ శ్రీను తదితరులు
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
సంగీతం: గౌర హరి
ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
విడుదల తేది: సెప్టెంబర్ 12, 2025
‘హనుమాన్’తో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ కొట్టిన తేజ సజ్జా, ఇప్పుడు మరోసారి అలాంటి పాన్ ఇండియా అప్పీల్ ఉన్న 'మిరాయ్'తో వచ్చాడు. ఈరోజు భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
కళింగ యుద్ధం అనంతరం పశ్చాత్తాపంతో మునిగిపోయిన అశోకుడు తనలోని దివ్యశక్తులను తొమ్మిది గ్రంథాలలో బంధించి, ప్రపంచ నలుమూలలలో తొమ్మిది మంది రక్షకులకి అప్పగిస్తాడు. శతాబ్దాల తరబడి ఈ గ్రంథాలు మానవాళిని కాపాడుతూ వస్తుంటాయి.
కానీ మహావీర్ లామా (మంచు మనోజ్) ఒక్కో గ్రంథాన్ని చేజిక్కించుకుంటూ ప్రపంచాన్ని పాలించాలనే ఆరాటంలో దూసుకుపోతాడు. అతని లక్ష్యం అమరత్వ రహస్యం దాచిన తొమ్మిదో గ్రంథం. ఆ తొమ్మిదో గ్రంథానికి రక్షకురాలు అంబిక (శ్రియా శరన్).
మహావీర్ ముప్పును ముందుగానే గ్రహించిన ఆమె, తన కొడుకు వేదను (తేజ సజ్జ) దూరంగా పెంచుతుంది. వారణాసి, కలకత్తా, హైదరాబాద్ నగరాల మధ్య పెరిగిన వేదకు తన నిజమైన పుట్టుక రహస్యంగా ఉంటుంది. కానీ.. ఒకరోజు తాను అంబిక పుత్రుడు అని, రక్షక వంశానికి వారసుడని తెలుసుకుంటాడు. మిరాయ్ అనే ప్రాచీన శక్తిని పొంది యోధునిగా పరిణామం చెందుతాడు.
ఆ తర్వాత మహావీర్ లామా, యోధ మధ్య యుద్ధం మొదలవుతుంది. చివరికి యుద్ధం ఎటు తేలింది? మహావీర్ అమరత్వం సాధించాడా? లేక యోధ అతడిని అడ్డుకున్నాడా? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ‘మిరాయ్’తో ఒక గ్రాండ్యుయర్ విజన్ ను తెరపై ఆవిష్కరించాడు. ఈ కథలో మైథాలజికల్ టచ్, సూపర్ హీరో యాంగిల్, గ్రాండ్ స్కేల్ అన్నీ కలిపి 'మిరాయ్'ను ఒక విజువల్ ట్రీట్ లా చూపిస్తాయి. ముఖ్యంగా కళింగ యుద్ధం, అశోక చక్రవర్తి, తొమ్మిది గ్రంథాలు అనే ఐడియా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది.
కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ కూడా కావడంతో సినిమాకు వచ్చిన విజువల్ రిచ్‌నెస్ ప్రత్యేకంగా ఉంది. సప్తపది గరుడ ఎపిసోడ్స్ నుంచి శబ్దగ్రంథం యాక్షన్ బ్లాక్ వరకు ప్రతి విజువల్ బిగ్ స్క్రీన్ మీద సాలిడ్‌గా కనిపిస్తుంది.
సినిమా ఫస్టాఫ్ లో పది పదిహేను నిమిషాలకు ఒక యాక్షన్ బ్లాక్ లేదా ట్విస్ట్ ఇస్తూ క్యూరియాసిటీ పెంచారు. కానీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిన తర్వాత పేస్ తగ్గింది. తర్వాత తేజ సజ్జా ట్రాన్స్‌ఫర్మేషన్ సీన్ మళ్లీ గాడిలో పడేసింది. అయితే యోధుడిగా మారే వేద మానసిక సంఘర్షణను తెరపై సరిగా చూపించలేకపోయారు.
అలాగే ‘మిరాయ్’లో గ్రాండ్ విజన్, రిచ్ విజువల్స్, మంచి యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. కానీ సెకండాఫ్ లో పేస్ డ్రాప్ అవ్వడం కొంచెం మైనస్ అయ్యింది. అలాగే విలన్ క్యారెక్టర్ ఆర్క్ ఇంకా బలంగా ఉంటే బాగుండేది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
‘హనుమాన్’తో సూపర్ హిట్ అందుకున్న తేజా సజ్జా మరోసారి అలాంటి లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ 'మిరాయ్'తో వచ్చాడు. తేజ సజ్జా పోషించిన పాత్రలో రెండు వేరియేషన్లు ఉన్నాయి. ఒకటి సాధారణ కుర్రాడు, మరొకటి యోధుడు. రెండు వేరియేషన్లలోనూ అదరగొట్టాడు తేజ.
మంచు మనోజ్ కు ఎక్కువ స్క్రీన్ టైమ్ లేకపోయినా, కనిపించిన ప్రతిసారి తన స్వాగ్, స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా శబ్ద గ్రంథం ఎపిసోడ్లోని యాక్షన్ బ్లాక్ ఇప్పటివరకు ఇండియన్ సినిమాల్లో చూడని రీతిలో ఉంది. శ్రియా శరన్ అంబిక పాత్రలో ఆకట్టుకుంది. జయరాం, జగపతిబాబు, రితికా సింగ్, గెటప్ శ్రీను తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.
టెక్నికల్ గా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. గౌర హరి అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని కీలక సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా డివోషనల్ సీన్స్‌లో ఆయన సంగీతం మూడ్‌ని బాగా హైలైట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పెట్టిన భారీ ఖర్చు, వీఎఫ్ఎక్స్ క్వాలిటీపై చూపిన శ్రద్ధ తెరపై స్పష్టంగా కనిపించింది.
చివరగా
'మిరాయ్'.. అద్భుతమైన విజువల్ ట్రీట్!