బిచ్చగాళ్లుగా మారుతున్న హీరోలు!

సినిమాలో హీరో అంటే ఏంటి? ప్యాక్డ్ బాడీ, స్టైలిష్ లుక్స్, క్లాస్ కార్‌లో ఎంట్రీ, ఒకేసారి పదుల సంఖ్యలో విలన్లను కొట్టేసే సూపర్ హ్యుమన్‌ లాంటి ఫీలింగ్. ఫ్యాన్స్‌కి హీరో అంటే వారి కలల్లో కనిపించేది దైవ రూపం.;

By :  S D R
Update: 2025-06-17 04:36 GMT

సినిమాలో హీరో అంటే ఏంటి? ప్యాక్డ్ బాడీ, స్టైలిష్ లుక్స్, క్లాస్ కార్‌లో ఎంట్రీ, ఒకేసారి పదుల సంఖ్యలో విలన్లను కొట్టేసే సూపర్ హ్యుమన్‌ లాంటి ఫీలింగ్. ఫ్యాన్స్‌కి హీరో అంటే వారి కలల్లో కనిపించేది దైవ రూపం. కానీ.. ఈ టెంప్లేట్‌ను మారుస్తూ.. కొంతమంది ‘స్టార్స్’ బిచ్చగాళ్ల పాత్రల్లోకి అడుగుపెడుతున్నారు.

2016లో తమిళ హీరో విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు’ సినిమాతో తెరపైకి వచ్చాడు. ఓ బిలియనీర్.. తల్లిని రక్షించేందుకు బిచ్చగాడిగా మారే కథ అప్పుడు ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనూ పెద్ద హిట్ అయింది. విజయ్ నటన, భావోద్వేగాలు ప్రేక్షకులను టచ్ చేశాయి. ఈ చిత్రం తర్వాత ‘బిచ్చగాడు’ అనే టైటిల్‌కి ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చేసింది. ఆ తర్వాత విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’ కూడా తెరకెక్కించాడు.

ఇప్పుడు విజయ్ ఆంటోని బాటలో ధనుష్ అలరించబోతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుబేర’ సినిమాలో ఆయన ఓ బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నాడు. ఇది బిచ్చగాడి పాత్రలో ఉండే హీరో కోసం నిర్మించిన సినిమా కాదు. ఇది ఓ అండర్‌డాగ్‌ నుంచి రైజింగ్‌ స్టార్‌ వరకూ తీసుకెళ్లే సగటు మనిషి కథ. ధనుష్‌ తనదైన స్టైల్‌లో, మేకోవర్‌లో ఇందులో కనిపించబోతున్నాడు. బిచ్చగాడిగా ధనుష్ మేకోవర్ కి ఇప్పటికే మంచి అప్లాజ్ వచ్చింది. జూన్ 20న 'కుబేర' విడుదలవుతుంది.

ఇప్పుడు ఇదే బాటలో మరో స్టార్ బిచ్చగాడిగా మారుతున్నాడు. ఆయనే విజయ్ సేతుపతి. నటనకు మారుపేరు అయిన ఈ తమిళ నటుడు.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ పవర్‌ఫుల్ డ్రామాలో నటించబోతున్నాడు. ఈ చిత్రంలో ఆయన ఓ బిచ్చగాడిగా కనిపించబోతున్నట్టు సమాచారం. అయితే.. ఇది సింపుల్ బెగ్గర్ పాత్ర కాదు. ఇదొక మిస్టీరియస్ క్యారెక్టర్‌గా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ దశలో ఉండగా.. త్వరలో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. మొత్తంగా ఇలా బిచ్చగాళ్ల పాత్రలు చేస్తున్న హీరోలంతా తమిళ నటులు కావడం కొసమెరుపు.

Tags:    

Similar News