'హరిహర వీరమల్లు' రివ్యూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ అవైటింగ్ మూవీ 'హరిహర వీరమల్లు'. పవన్ డిప్యూటీ సిఎం అయిన తర్వాత రిలీజైన చిత్రమిది. క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్త దర్శకత్వంలో ఎ.ఎమ్.రత్నం నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.;

By :  S D R
Update: 2025-07-24 00:48 GMT

నటీనటులు: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, తనికెళ్ల భరణి, రఘుబాబు తదితరులు

సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస

సంగీతం: కీరవాణి

ఎడిటింగ్ : ప్రవీణ్ కేఎల్

నిర్మాత: ఏఎం రత్నం

దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ

విడుదల తేది: జూలై 24, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ అవైటింగ్ మూవీ 'హరిహర వీరమల్లు'. పవన్ డిప్యూటీ సిఎం అయిన తర్వాత రిలీజైన చిత్రమిది. క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్త దర్శకత్వంలో ఎ.ఎమ్.రత్నం నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. ఈరోజు వరల్డ్ వైడ్ గా రిలీజవుతోన్న 'హరిహర వీరమల్లు'కి నిన్నే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి.. 'హరిహర వీరమల్లు' సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ

ఈ కథ 1650ల్లో ప్రారంభమవుతుంది. కృష్ణా నదిలో కొట్టుకొచ్చిన ఓ పసిబిడ్డను గూడెం ప్రజలు రక్షించి శివాలయ పూజారికి అప్పగిస్తారు. ఆయన ఆ బాలుడికి హరిహర వీరమల్లు అని పేరు పెడతాడు. కాలక్రమంలో అతడు ధైర్యవంతుడిగా ఎదిగి, దొరలను దోచి పేదవారికి సాయం చేసే రాబిన్ హుడ్ లా మారతాడు.

పేదలకోసం ధనికులపై దాడి చేసే వీరమల్లు, ఒకసారి పంచమిని (నిధి అగర్వాల్) చూసి ప్రేమిస్తాడు. కానీ ఆమె అతన్ని మోసం చేస్తుంది. ఫలితంగా వీరమల్లు హైదరాబాద్ పాలకుల చెరలో పడతాడు. అయితే అతని తెలివితేటలు చూసిన కుతుబ్ షా.. ఔరంగజేబ్ వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించమని ఆదేశిస్తాడు.

అప్పటి నుంచి మొదలవుతుంది వీరమల్లుని అసలైన ప్రయాణం. ఔరంగజేబు పాలనలోని దుర్మార్గాన్ని, పంచమి వెనుకున్న మిస్టరీని, వీరమల్లు గతాన్ని తెరపై చూస్తేనే తెలుస్తుంది.

విశ్లేషణ

'హరిహర వీరమల్లు' కోసం ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఈ సినిమా ఓ విజువల్ ట్రీట్ అందించిందని చెప్పొచ్చు. ఊహించని ఎలివేషన్లు, మాస్ ట్రీట్మెంట్, క్రేజీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ గా తృప్తిపరుస్తోంది.

సినిమాలో వచ్చే పాటలు, ఫైట్లు కథకు అనుగుణంగా సాగుతాయి. ప్రత్యేకంగా క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. సనాతన ధర్మం కోసం జరిగే పోరాటాన్ని, అప్పటి దారుణ సంఘటనలను కన్నెదురుగా చూపించారు. ఎమోషనల్ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో తన విశ్వరూపాన్ని చూపించాడు. గత కొన్ని సినిమాల్లో చూడని కొత్త పవన్‌ని ఈ సినిమాలో చూస్తాము. యాక్షన్ బ్లాక్స్‌లో పవర్ స్టార్ తన సొంత మార్క్ చూపించి మెస్మరైజ్ చేశాడు.

ఈ చిత్రంలో ఓ మంచి పాయింట్‌ను ఆధారంగా తీసుకుని కథను అల్లిన విధానం ప్రశంసనీయం. ముఖ్యంగా ఫస్టాఫ్ లో పోర్ట్ ఫైట్‌, చార్మినార్ యాక్షన్ సీన్, 'కొల్లగొట్టినాదిరో' పాట ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే కుతుబ్ షాహీ కోట సన్నివేశాలు బాగున్నాయి.

అయితే కొన్ని చోట్ల కథనం ఊహాజనితంగా మారడంతో ఆసక్తి తగ్గినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో మాస్, ఎలివేషన్ సీన్లు బలహీనంగా ఉండటం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. ఫస్టాఫ్‌లో సృష్టించిన రేంజ్‌ను సెకండాఫ్‌లో కూడా కొనసాగించి ఉంటే సినిమాకు మరింత బలమయ్యేది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో చిత్రం నిరాశ పరిచింది. సన్నివేశాలకు అనుగుణంగా గ్రాఫిక్స్ ఉండకపోవడంతో కొన్ని సన్నివేశాలు బలహీనంగా మారిపోయాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఇప్పటివరకు సమకాలీన పాత్రల్లోనే ఎక్కువగా కనిపించాడు. ఇది పవన్ నటించిన తొలి చారిత్రక, జానపద తరహా చిత్రం. ఈ తరహా సినిమాలో పవన్ ఎలా కనిపిస్తాడో? అన్న అనుమానాలున పటాపంచలు చేస్తూ 'హరిహర వీరమల్లు' పాత్రలో ఆయన కనిపించిన తీరు, ఆ పాత్రలో ఆయన చూపించిన గంభీరత, హీరోయిజం, యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి.

హీరోయిన్ నిధి అగర్వాల్ పంచమి పాత్రలో నటించి ఆకట్టుకుంది. ‘కొల్లగొట్టినాదిరో, తార తార’ పాటల్లో ఆమె మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ కొత్తగా కనిపించి ఇంప్రెష్ చేశాడు. అయితే.. ఫస్టాఫ్ లో స్ట్రాంగ్ గా కనిపించిన పాత్ర సెకండాఫ్ లో వీక్ గా అనిపిస్తుంది. దివంగత కోట శ్రీనివాసరావు ఓ చిన్న పాత్రలో మెరిశారు. సునీల్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, నాజర్, రఘుబాబు, మురళీశర్మ, సచిన్ ఖేడ్కర్, సుబ్బరాజు, అయ్యప్ప శర్మ, కబీర్ దుహాన్ సింగ్ వంటి వారు తమ పాత్రల్లో అలరించారు. అనసూయ, పూజిత పొన్నాడ స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు.

టెక్నికల్ గా ఈ మూవీకి ప్రధాన బలం కీరవాణి అందించిన నేపథ్య సంగీతం. తన ఆర్.ఆర్. ద్వారా పవన్ కళ్యాణ్ హీరోయిజాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు కీరవాణి. పాటలు కూడా సినిమాకు బలంగా నిలిచాయి. జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస ఇద్దరూ సమకూర్చిన సినిమాటోగ్రఫీ బాగుంది. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ బాగున్నాయి. మొత్తానికి నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి.

చివరగా

'హరిహర వీరమల్లు'.. ధర్మం కోసం పోరాటం!

Tags:    

Similar News