థియేటర్ల మూసివేత సరైనది కాదు.. అల్లు అరవింద్

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి థియేటర్ల మూసివేత, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల గురించి మాట్లాడారు.;

By :  S D R
Update: 2025-05-25 12:06 GMT

థియేటర్ల మూసివేత సరైనది కాదు.. అల్లు అరవింద్

జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అనే నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన రిటర్న్ గిఫ్ట్ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కలకలం సృష్టించాయి. ఈనేపథ్యంలో ఇండస్ట్రీలో ఆ నలుగురి వలనే ఇదంతా జరుగుతుంది అనే ప్రచారం ఊపందుకుంది. దీంతో.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి థియేటర్ల మూసివేత, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల గురించి మాట్లాడారు.

నిర్మాత అల్లు అరవింద్ మీడియా సమావేశంలో జూన్ 1 నుండి థియేటర్లు మూసివేస్తామని వస్తున్న వార్తలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో చోటుచేసుకుంటున్న సమస్యలు, ఆరోపణలు, రాజకీయ సంబంధాల నేపథ్యంలో ఆయన ఇచ్చిన స్పష్టీకరణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈ సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘నా వృత్తి సినిమాలు తీయడం. అదే నమ్ముకున్నాను. గత 50 ఏళ్లుగా నేను ఇదే చేశాను. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు. ఆ నలుగురిలో నేను లేను. ఏదో పదిహేనేళ్ల క్రితమే మొదలైన వ్యవహారంలో నన్ను లాగడం సరికాదు. నేను ఆ వ్యాపారం నుంచి బయటకి వచ్చేశాను‘ అన్నారు.

‘తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్లు ఉన్నా, నాకు ఉన్నవి కేవలం 15. వీటిని కూడా వదిలేస్తున్నాను. అందుకే థియేటర్ల వ్యాపారంతో నాకు సంబంధం లేదని స్పష్టంగా చెబుతున్నాను‘ అని అన్నారు.

థియేటర్ల మూసివేత గురించి ఏకపక్ష నిర్ణయాలను ఆయన ఖండించారు.

‘థియేటర్లు మూసేస్తామని తేల్చేయడం సరికాదు. థియేటర్లకు సమస్యలున్నాయనేది నిజమే. కానీ అలాంటి సందర్భాల్లో ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి చర్చించి, ప్రభుత్వ సహకారంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఒకరిపై ఆరోపణలు చేస్తూ, రాజకీయ రంగంలోకి లాగడం సబబు కాదు‘ అని అన్నారు.

అలాగే, గతంలో ప్రభుత్వం సహకారం అవసరమైన సందర్భంలో పరిశ్రమ పెద్దలు అప్పటి ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లారని గుర్తు చేశారు. ‘ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఏమీ జరగదు. గత ముఖ్యమంత్రిని కలిశారంటే, అది సహాయం కావాలనే కదా. అలాంటప్పుడు ఇప్పుడు కూడా ప్రభుత్వ అండదండలు అవసరం‘ అని వివరించారు.

అల్లు అరవింద్ మరికొంతమంది సినీ పెద్దలు పవన్ కళ్యాణ్‌ను కలిసినప్పుడు చంద్రబాబు నాయుడును కలవమని సూచించారని, కలవాలని అనుకున్నప్పటికీ అలా జరగలేదని తెలిపారు. 

Tags:    

Similar News