29 మంది సెలబ్రిటీలపై కేసు
తెలంగాణలో నిషేధిత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలు, ప్రమోషన్లపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది.;
తెలంగాణలో నిషేధిత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలు, ప్రమోషన్లపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. సినీ నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సహా మొత్తం 29 మందిపై ఈడీ కేసులు నమోదు చేసింది.
సైబరాబాద్, హైదరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఈ కేసులు నమోదయ్యాయి. నిషేధిత బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసినందుకు భారీ పారితోషికం తీసుకున్నారని, ఆ మొత్తాన్ని ఆదాయపన్ను రిటర్నుల్లో చూపలేదన్న ఆరోపణలతో ఈడీ కేసులు నమోదు చేసింది.
ఈడీ నమోదు చేసిన కేసులో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగెళ్ల, శ్రీముఖి, శ్యామల, రీతూ చౌదరి, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, శోభా శెట్టి, అమృత చౌదరి, టేస్టీ తేజ తదితరుల పేర్లు ఉన్నాయి. వీరంతా ప్రచారం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, వాటి ద్వారా లక్షల మందికి యాప్స్ పరిచయం అయ్యాయి.
నిషేధిత బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ద్వారా ప్రజలను ఉత్సాహపరిచారని.. యువత ఈ యాప్స్ వల్ల బానిసలై అప్పుల్లో కూరుకుపోయారని.. పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. యాప్స్ నిర్వహణలో ఉన్న సంస్థలు భారీ మొత్తాలను కమీషన్‌గా చెల్లించాయన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో ‘జంగిల్ రమ్మీ, ఏ23, యోలో 247, ఫెయిర్ ప్లే, విబుక్, ధనిబుక్ 365, ఆంధ్రా365, తాజ్777బుక్, పరిమ్యాచ్‘ వంటి నిషేధిత యాప్స్ పేర్లు ఉన్నాయి.