'ఫౌజీ'ని తాకిన పహల్గాం ఘటన!
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు దారి తీసింది. పర్యాటక స్వర్గధామంగా పేరొందిన పహల్గాంలో జరిగిన ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.;
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు దారి తీసింది. పర్యాటక స్వర్గధామంగా పేరొందిన పహల్గాంలో జరిగిన ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. నిర్దోషులపై జరిగిన ఈ నరమేధం దేశ ప్రజల మనసులను కలిచివేసింది. ఈ దాడికి స్పందనగా సామాజిక మాధ్యమాల్లో, ప్రజల్లో పెరుగుతున్న జాతీయభావోద్వేగం కళా రంగానికీ విస్తరిస్తోంది.
ముఖ్యంగా ప్రభాస్ ‘ఫౌజీ’ చిత్రాన్ని ఈ వివాదంలోకి లాగుతున్నారు కొంతమంది నెటిజన్లు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న ఇమాన్వి ఈ వివాదానికి కేంద్రబిందువయ్యింది. ఆమె తండ్రి ఒక మాజీ పాకిస్తాన్ మిలిటరీ అధికారిగా ఉండటం ఈ వివాదానికి కారణం. దీని ఆధారంగా కొంతమంది ఆమెను చిత్రంలో కొనసాగించకూడదని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఇమాన్వి ఢిల్లీలో పుట్టి పెరిగింది. అక్కడే విద్యాభ్యాసం చేసింది. ఆమెకు పాకిస్థాన్‌తో ప్రత్యక్ష సంబంధం లేదని, ఆమె వ్యక్తిగత జీవితం, అభిరుచులు పూర్తిగా భారతీయతను ప్రతిబింబిస్తాయంటూ కొంతమంది ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. కళకు, కళాకారుడి వ్యక్తిగత నేపథ్యానికి సంబంధం లేదని వారు వాదిస్తున్నారు.