మళ్లీ వెండితెరపై మెగా మాయాజాలం
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో క్లాసిక్ గా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మే 9, 1990న విడుదలైన ఈ చిత్రం, అదే తేదీయైన ఈ మే 9న రీరిలీజవుతుంది.;
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో క్లాసిక్ గా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మే 9, 1990న విడుదలైన ఈ చిత్రం, అదే తేదీయైన ఈ మే 9న రీరిలీజవుతుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ ఐకానిక్ సినిమాను 2D, 3D ఫార్మాట్లలో, అత్యాధునిక 8K రీమాస్టర్డ్ వెర్షన్ గా మళ్లీ థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ పట్ల ఉన్న అంకితభావాన్ని చెప్పాలంటే, రీ-రిలీజ్ కోసం దాదాపు రూ. 8 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. 'కల్కి 2898AD' డైరెక్టర్ నాగ్ అశ్విన్ పర్యవేక్షణలో ఈ టెక్నికల్ వర్క్ జరుగుతోంది. ఇది భారతదేశంలో 8K 3D ఫార్మాట్లో రీ-రిలీజ్ అవుతున్న తొలి సినిమా కావడం విశేషం.
చిరంజీవి టూరిస్ట్ గైడ్ పాత్రలో, శ్రీదేవి దేవత పాత్రలో మెరిసిన ఈ సినిమాకు, రాఘవేంద్రరావు విజన్, జంధ్యాల-యండమూరి రచన, ఇళయరాజా సంగీతం, వేటూరి లిరిక్స్, బాలు గాత్రం అన్నీ కలిసి ఒక మాయాజాలాన్ని తెరపై ఆవిష్కరించాయి. అప్పట్లో టికెట్ రూ. 6.50 మాత్రమే అయినా, బ్లాక్ మార్కెట్‌లో అదే టికెట్ రూ. 210కి అమ్ముడయ్యిందంటే, సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా రీ-రిలీజ్ ట్రెండ్‌లో ఈ చిత్రం మరో భారీ ప్రయోగంగా నిలవనుంది.
ఈ సినిమా రీ-రిలీజ్ ప్రకటన వెలువడినప్పటి నుంచి సోషల్ మీడియాలో హైప్ ఊపందుకుంది. చిరంజీవి ఫ్యాన్స్, సినిమా ప్రియులు ఈ సినిమాను మళ్లీ పెద్ద తెరపై చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలు మల్టీఫ్లెక్సెస్ లలో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా ప్రకటనల బోర్డులను ఏర్పాటు చేశారు.అలాగే గతంలో ఈ చిత్రం గురించి నటీనటులు, సాంకేతిక నిపుణులు చెప్పిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.