పహల్గాం ఘటనను ఖండించిన సెలబ్రిటీలు
భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఘోర సంఘటన పహల్గాంలో చోటుచేసుకుంది. 'మినీ స్విట్జర్లాండ్'గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవికంగా దాడి చేశారు.;
భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఘోర సంఘటన పహల్గాంలో చోటుచేసుకుంది. 'మినీ స్విట్జర్లాండ్'గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవికంగా దాడి చేశారు. ఈ ఘటనలో 28 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర స్పందనకు దారితీసింది.
పహల్గాం ఘటనపై తెలుగు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ దారుణంపై తమ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చిరంజీవి ఈ దాడిని హృదయ విదారకమైన ఘటనగా అభివర్ణిస్తూ, ‘ఇది క్షమించరాని క్రూరచర్య. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. వారి నష్టాన్ని పూరించలేం, నా ప్రార్థనలు వారితోనే‘ అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ భావోద్వేగంగా స్పందిస్తూ, ‘పహల్గాం దాడి బాధితుల గురించి తెలిసి హృదయం ద్రవించిపోయింది. మృతుల కుటుంబాలకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను‘ అని పేర్కొన్నారు. ఇంకా మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు కూడా ఈ ఘటనపై స్పందించారు.
మహేష్ బాబు తన ఎక్స్ పోస్ట్ లో ‘పహల్గాం లో జరిగిన దాడి నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి క్రూరత్వానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడే శక్తి మనకు లభిస్తుందని ఆశిస్తున్నాను. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలతో నా ఆలోచనలు, ప్రార్థనలు ఉన్నాయి.‘ అన్నారు.
అల్లు అర్జున్ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, శాంతి కోసం ప్రార్థనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రామ్ చరణ్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ‘పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి నా మనసును కదిలించేసింది. సమాజంలో ఇలాంటి దారుణాలకు చోటు లేదు‘ అని పేర్కొన్నారు.
విజయ్ దేవరకొండ ఉగ్రవాదాన్ని ‘పిరికి, సిగ్గుమాలిన చర్య‘గా విమర్శిస్తూ, ‘భారతదేశం ఎప్పటికీ ఉగ్రవాదం ముందు తలవంచదు. బాధితులతో, కాశ్మీర్‌తో మేము నిలబడతాము‘ అని ధీమా వ్యక్తం చేశారు.