ఆపదలో అండగా నిలిచిన లారెన్స్!
తమిళనాడులోని శివగంగై జిల్లా తిరుప్పువనానికి చెందిన కుమార్, ఆయన భార్య ముత్తుకరుప్పి దినసరి కూలీలు. ముగ్గురు పిల్లల భవిష్యత్ కోసం కష్టపడి దాచిన లక్ష రూపాయలు చెద పురుగుల పాలవ్వడం ఆ చిన్న కుటుంబాన్ని కన్నీటి పర్యంతం చేసింది.;
తమిళనాడులోని శివగంగై జిల్లా తిరుప్పువనానికి చెందిన కుమార్, ఆయన భార్య ముత్తుకరుప్పి దినసరి కూలీలు. ముగ్గురు పిల్లల భవిష్యత్ కోసం కష్టపడి దాచిన లక్ష రూపాయలు చెద పురుగుల పాలవ్వడం ఆ చిన్న కుటుంబాన్ని కన్నీటి పర్యంతం చేసింది. హుండీలో దాచి భద్రంగా ఉంచామని అనుకున్నారు గానీ.. అశ్రద్ధ కారణంగా ఆ మొత్తం దెబ్బతింది.
ఈ విషాద కథ మీడియాలో చూసిన రాఘవ లారెన్స్ తక్షణమే స్పందించాడు. ఆ కుటుంబానికి వారు కోల్పోయిన మొత్తం లక్ష రూపాయలను స్వయంగా అందించి ధైర్యం చెప్పాడు. ఈ సహాయంతో మరోసారి లారెన్స్ తన మంచి హృదయాన్ని చాటుకున్నాడు. డ్యాన్స్ మాస్టర్‌గా ప్రారంభమైన లారెన్స్ ప్రయాణం ఇప్పుడు దర్శకుడు, కథానాయకుడిగా అప్రతిహతంగా కొనసాగుతోంది. దాంతో పాటు అప్పుడప్పుడు ఇలా తన మానవతా హృదయాన్ని చాటుకుంటూనే ఉన్నాడు.
'కష్టపడి సంపాదించిన డబ్బులు చెదలు తినేశాయన్న వార్త హృదయాన్ని కలచివేసింది. వారి బాధను కొంతైనా తుడిచేందుకు ఇది నా చిన్న సహాయం' అంటూ లారెన్స్ తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.
ప్రస్తుతం 'బెంజ్' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న లారెన్స్ ఇలా విరాళాల రూపంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. అవసరమైన చోట అండగా నిలవడం కూడా ఓ నిజమైన హీరో లక్షణమే కదా!