30 వేల కోట్ల ఆస్తి కోసం వివాదం

బాలీవుడ్‌ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, సోనా కామ్‌స్టార్ సంస్థ మాజీ చైర్మన్ సంజయ్‌ కపూర్ జూన్‌ 12న లండన్‌లో పోలో ఆడుతూ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం తరువాత కపూర్‌ కుటుంబంలో ఆస్తి పంపకాలపై తీవ్రమైన వివాదం చెలరేగింది.;

By :  S D R
Update: 2025-09-11 04:27 GMT

బాలీవుడ్‌ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, సోనా కామ్‌స్టార్ సంస్థ మాజీ చైర్మన్ సంజయ్‌ కపూర్ జూన్‌ 12న లండన్‌లో పోలో ఆడుతూ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం తరువాత కపూర్‌ కుటుంబంలో ఆస్తి పంపకాలపై తీవ్రమైన వివాదం చెలరేగింది. దాదాపు ₹30 వేల కోట్ల విలువైన ఆస్తి కోసం సంజయ్‌ పిల్లలు, ఆయన తల్లి రాణీ కపూర్‌ పరస్పరం కోర్టు తలుపులు తట్టారు.

సంజయ్‌–కరిష్మా దంపతుల పిల్లలు సమైరా (20), కియాన్‌ (15) ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమ తండ్రి రాసిన అసలు వీలునామాను సవతి తల్లి ప్రియా సచ్‌దేవ్ దాచిపెట్టి, నకిలీ పత్రం చూపించిందని వారు ఆరోపించారు. జూలై 30న జరిగిన కుటుంబ సమావేశంలోనే మార్చి 21 తేదీతో ఉన్న పత్రాన్ని వీలునామా అంటూ చూపించారని పేర్కొన్నారు. 'అది పూర్తిగా నకిలీది, అసలు కాపీని ఎప్పుడూ ఇవ్వలేదు' అని పిల్లలు కోర్టుకు తెలిపారు. తమను చట్టబద్ధమైన Class-1 వారసులుగా గుర్తించి, ఆస్తిలో ఒక్కొక్కరికి ఐదోవంతు వాటా ఇప్పించాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు 'నేనే సంజయ్‌ చట్టబద్ధమైన భార్యను. కరిష్మా చాలా కాలం క్రితమే విడిపోయింది. నాకు ఆరేళ్ల బిడ్డ ఉన్నాడు. నా పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోండి' అంటూ కోర్టులో విన్నవించారు సంజయ్ కపూర్ భార్య ప్రియ సచ్‌దేవ్. ఇప్పటికే కరిష్మా పిల్లలకు ₹1,900 కోట్లు ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా ఇచ్చాం. ఇంకా ఏమి కావాలి?' అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

ఇక సంజయ్‌ తల్లి రాణీ కపూర్ (80) కూడా ఈ ఆస్తి వివాదంలో కోర్టును ఆశ్రయించారు. 'నేడు నాకు తల దాచుకునే గూడు కూడా లేదు' అని కన్నీటి పర్యంతమయ్యారు. సంజయ్‌ సహజ మరణం చెందలేదని, ఆయన హత్యకు గురయ్యారని ఆరోపిస్తూ బ్రిటన్‌ అధికారులకు లేఖ రాశారు. కుమారుడి మరణం వెనుక కుట్ర, భారీ ఆర్థిక మోసం దాగి ఉందని విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

సంజయ్‌ 1996లో నందిని మహతానిని వివాహం చేసుకుని 2000లో విడిపోయారు. తర్వాత 2003లో కరిష్మా కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే 2016లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రియా సచ్‌దేవ్‌తో వివాహం చేసుకున్నారు. మొత్తంగా.. సంజయ్ కపూర్‌ కుటుంబ ఆస్తి వివాదం రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటోంది.

Tags:    

Similar News