'వీర ధీర శూర 2' రివ్యూ
విలక్షణ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచే విక్రమ్ కు సరైన హిట్టొచ్చి చాన్నాళ్లే అయ్యింది. అయినా సినిమా, సినిమాకీ పాత్రల ఎంపికలో విలక్షణంగానే దూసుకెళ్తున్నాడు చియాన్. ఈసారి విక్రమ్ 'వీర ధీర శూర 2' అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు.;
నటీనటులు: విక్రమ్, ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషార విజయన్, పృథ్వీరాజ్, సిద్ధిఖీ తదితరులు
సినిమాటోగ్రఫీ: థేని ఈశ్వర్
సంగీతం: జీవీ ప్రకాష్
ఎడిటింగ్: ప్రసన్న జీకే
నిర్మాత: రియా శిబు
దర్శకత్వం: ఎస్‌యూ అరుణ్‌కుమార్
విడుదల తేది: 27-03-2025
విలక్షణ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచే విక్రమ్ కు సరైన హిట్టొచ్చి చాన్నాళ్లే అయ్యింది. అయినా సినిమా, సినిమాకీ పాత్రల ఎంపికలో విలక్షణంగానే దూసుకెళ్తున్నాడు చియాన్. ఈసారి విక్రమ్ 'వీర ధీర శూర 2' అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మొదటి భాగం విడుదలవ్వకుండానే రెండో పార్ట్ తో ప్రేక్షకుల్ని పలకరించాడు. మరి.. విక్రమ్ ‘వీర ధీర శూర 2‘ ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
కాళి (విక్రమ్) తన కుటుంబంతో ప్రశాంత జీవితం గడుపుతూ, చిన్న కిరాణా దుకాణాన్ని నడిపే సాధారణ వ్యక్తి. భార్య వాణి (దుషారా విజయన్)తో కలిసి పిల్లలను చూసుకోవడమే అతని ప్రపంచం. అయితే, అతని గతం పూర్తిగా భిన్నమైనది. ఒకప్పుడు అతను రవి (థర్టీ ఇయర్స్ పృథ్వీ)కు నమ్మకమైన అనుచరుడిగా ఉండేవాడు. గొడవలు, హింసతో నిండిన జీవితం నుంచి బయటపడిన కాళి, తన గతాన్ని పూర్తిగా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించాడు.
ఒకరోజు రవి, కాళిని కలవడానికి వస్తాడు. తన కొడుకు కన్నా (సూరజ్ వెంజరమూడు)తో పాటు తన ప్రాణానికి ముప్పుగా మారిన ఎస్పీ అరుణగిరి (ఎస్.జె. సూర్య)ని అంతమొందించాలని కోరతాడు. దీంతో పరిస్థితులు కాళీని మరోసారి తన మునుపటి జీవితంలోకి లాక్కొస్తాయి. అప్పుడు కాళీ, ఎస్పీ అరుణగిరి మధ్య ఏం జరిగింది? మధ్యలో రవి కొడుకు కన్నా పాత్ర ఏంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ
సాధారణంగా సీక్వెల్ సినిమాలు మొదటి భాగం తర్వాత వస్తాయి, కానీ ‘వీర ధీర శూర‘ మాత్రం ముందుగా రెండో భాగంగా విడుదలై కొత్త ట్రెండ్‌ను తీసుకువచ్చింది. ఈ సినిమా మొత్తం ఒకే రాత్రిలో జరిగే సంఘటనల సమాహారం. కథను నడిపించే సంఘటనలు, పాత్రల తీరు, యాక్షన్ ఘట్టాలు ‘ఖైదీ‘ సినిమాను గుర్తుకు తెస్తాయి.
ఈ సినిమా ఆరంభం నుంచే ఆసక్తికరంగా మొదలై, సహజమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విక్రమ్ పాత్ర పరిచయం కాస్త ఆలస్యమైనప్పటికీ, ఆయన ఎంట్రీ తర్వాత సినిమా మరింత గ్రిప్పింగ్ గా మారుతుంది. సెకండాఫ్ లో కథనం కొంత డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగినప్పటికీ, క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. గ్రామీణ నేపథ్యంలో గొడవలను చాలా సహజంగా చూపించారు. రా అండ్ రస్టిక్ సినిమాలను ఇష్టపడేవారికి ఇదొక విజువల్ ట్రీట్ లా అనిపిస్తుంది.
మరోవైపు కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా రొటీన్ యాక్షన్ డ్రామాగా అనిపిస్తుంది. సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలు ఉండడం కూడా మైనస్ అని చెప్పొచ్చు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడంలో దిట్టైన విక్రమ్ మరోసారి తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ లో అయితే విక్రమ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. హీరోయిన్ దుషారా విజయన్ తన పాత్రకు న్యాయం చేసింది. ఎస్.జె.సూర్య, సూరజ్ వెంజరమూడు తమదైన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. ఇక 30 ఇయర్స్ పృథ్వీ ఈ సినిమాలో సర్ప్రైజ్ ప్యాకేజ్ అని చెప్పాలి.
టెక్నికల్ డిపార్ట్ మెంట్ విషయానికొస్తే.. జీవీ ప్రకాష్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం. ఇంటర్వెల్, క్లైమాక్స్‌లోని మాస్ మూమెంట్స్‌ను ఎలివేట్ చేస్తూ బి.జి.ఎమ్. మంచి ఇంపాక్ట్ చూపింది. ఒక రాత్రిలో జరిగిన నేపథ్యాన్ని బాగా చూపించడంలో సినిమాటోగ్రఫీ కీలక పాత్ర పోషించింది. ఎడిటర్ కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. ప్రొడక్షన్ వేల్యూస్ ఫర్వాలేదు.
చివరగా
‘వీర ధీర శూర 2‘.. రొటీన్ యాక్షన్ డ్రామా