'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ
నటీనటులు: వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, నరేశ్ వి.కె, అవసరాల శ్రీనివాస్, వీటీవీ గణేశ్, మురళీధర్ గౌడ్, ఉపేంద్ర లిమాయే, సాయికుమార్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్
దర్శకత్వం: అనిల్ రావిపూడి
విడుదల తేది: 14-01-2025
సంక్రాంతి కానుకగా ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‘ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈరోజు సంక్రాంతిని పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం‘. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. ఇప్పటికే వెంకీ-అనిల్ కాంబోలో వచ్చిన ‘ఎఫ్ 2, ఎఫ్ 3‘ ఘన విజయాలు సాధించడంతో ‘సంక్రాంతికి వస్తున్నాం‘పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. మరి.. ఆ అంచనాలను అందుకోవడంలో ‘సంక్రాంతికి వస్తున్నాం‘ సఫలమైందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
అమెరికాలో బడా వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన సత్య ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్), తన మాతృభూమికి సేవ చేయాలన్న లక్ష్యంతో హైదరాబాద్ వస్తాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేశవ (నరేశ్ వి.కె) సత్యను రాష్ట్రానికి ఆహ్వానిస్తూ, ఇక్కడ కొత్త కంపెనీలు నెలకొల్పి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుతాడు. ముఖ్యమంత్రి కేశవ, సత్యకు ప్రత్యేక భద్రత కల్పించేందుకు మీనాక్షి (మీనాక్షి చౌదరి)ని నియమిస్తాడు.
సత్య హైదరాబాద్‌కు రాగానే పాండే గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు పొక్కితే ప్రభుత్వం పడిపోతుందనే భయంతో, ముఖ్యమంత్రి కేశవ ఒక రహస్య ఆపరేషన్ ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. ఆపరేషన్ విజయవంతం చేయడానికి, కేశవ తన తొలి ఆలోచనగా మాజీ పోలీస్ అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అయిన యాదగిరి దామోదర రాజు అలియాస్ చిన్నరాజు అలియాస్ వెండి రాజు (వెంకటేష్)ను రంగంలోకి తీసుకురావాలని భావిస్తాడు.
రాజు, పోలీస్ వ్యవస్థపై కోపంతో ఉద్యోగం వదిలేసి ప్రశాంత జీవితం గడుపుతున్న వ్యక్తి. అతన్ని మళ్లీ విధి నిర్వహణకు ఒప్పించడానికి కేశవ, రాజు మాజీ ప్రేయసి మీనాక్షిని ముందుకు పంపుతాడు. మీనాక్షి, రాజును ఒప్పించడానికి పడిన కష్టాలేంటి? రాజు భార్య భాగ్యం (ఐశ్వర్య రాజేశ్) అందుకు ఒప్పుకుందా? వంటి విశేషాలు తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
కుటుంబ కథా చిత్రాలకు, క్రైమ్ అంశాలతో ముడిపడిన వినోదాత్మక కథలకు తెలుగు సినిమాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రం కథ కూడా ఈ రెండింటి మిశ్రమంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందింది. ఈ సినిమా మేజర్ హైలైట్ పాయింట్ అనేది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం. సినిమా గోదావరి జిల్లాల్లోకి ప్రవేశించిన తర్వాత, కథనం మరింత హిలేరియస్‌గా మారుతుంది. ముఖ్యంగా, వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్‌గా వర్కవుట్ అయ్యాయి. తన కొడుకుతో వెంకటేష్ చేసిన ఓ ఎపిసోడ్ అయితే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.
దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో ఫ్యామిలీ డ్రామాను వినోదభరితంగా తీర్చిదిద్దాడు. ఇద్దరు మహిళల మధ్య నడిచే డ్రామాను క్రేజీ లెవెల్లో ప్రెజెంట్ చేయడం ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇట్టే కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.
మీనాక్షి–రాజుల మధ్య ఉన్న బ్రేకప్ కథ, రాజు కుటుంబంలోని సరదా సంఘటనలు, అతని భార్య భాగ్యం పాత్ర తీరు కథనానికి వినోదాన్ని, భావోద్వేగాన్ని చేరుస్తాయి. ‘గోదారి గట్టు’ పాట, హీరో ఫ్యామిలీ ట్రాక్ వంటి అంశాలు కథను వేగంగా నడిపించాయి.
ద్వితీయార్ధంలో ఆశించినంత బలమైన సన్నివేశాలు లేకపోయినప్పటికీ, హీరో ప్రదర్శించే భావోద్వేగాలు, భాగ్యం–మీనాక్షిల మధ్య గిల్లికజ్జాలు ప్రేక్షకులకు ఆహ్లాదం కలిగిస్తాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణులు:
వెంకటేష్ కి పోలీస్ పాత్రలు కొత్తేమీ కాదు. అయితే ఈ సినిమాలో ఆయన మాజీ పోలీస్ అధికారిగా కనిపించడం కొత్త. ఒకవైపు భార్యను అమితంగా ప్రేమించే భర్తగా, మరోవైపు లవర్‌బాయ్‌గా, ఇంకోవైపు పోలీస్‌గా తన నటనలో విభిన్న కోణాల్ని ఎంతో ఈజ్ తో ఆవిష్కరించాడు వెంకటేష్. తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో వెంకీ సినిమా మొత్తానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.
ముఖ్యంగా, తన ప్రేమకథ భార్యకు తెలిశాక వచ్చే సన్నివేశాల్లో, ఒకవైపు భార్య, మరోవైపు మాజీ ప్రేయసితో అతని ఫ్రస్టేషన్ దృశ్యాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. తన నటనలో భావోద్వేగాలు, హాస్యాన్ని సమపాళ్లలో మేళవించడంలో వెంకీ నిపుణుడని మరోసారి నిరూపించాడు.
భాగ్యంగా ఐశ్వర్య రాజేశ్ అదరగొట్టింది. వెంకటేష్ తో ఆడిపాడే సన్నివేశాల్లో బాగా ఆకట్టుకుంటుంది. మీనుగా మీనాక్షి చౌదరి గ్లామరస్ కాప్‌గా మాత్రమే కాకుండా, కామెడీ ట్రాక్‌లోనూ ఆకట్టుకుంది. వీటీవీ గణేశ్, ఉపేంద్ర, మురళీధర్ గౌడ్ పాత్రలు నవ్వులను పండించాయి. చిన్నోడు (వెంకీ తనయుడి పాత్ర) ఆద్యంతం నవ్వులు పంచింది. వెంకటేష్ తో కలిసి వచ్చే అతని సీన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. అవసరాల శ్రీనివాస్, సాయికుమార్ పాత్రలు పరిమితమైనప్పటికీ కథలో బలమైన ముద్ర వేశాయి.
అనిల్ రావిపూడి తనదైన శైలిలో ఈ సినిమాను కూడా పూర్తి వినోదభరితంగా తీర్చిదిద్దాడు. స్టోరీ రొటీన్ అయినా తనదైన కథనంతో ఆద్యంతం నవ్వులు పంచడంలో సక్సెస్ అయ్యాడు అనిల్ రావిపూడి. దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన ఈ చిత్రం మెరుగైన నిర్మాణ విలువలతో రూపొందింది. సినిమాటోగ్రఫీ రంగుల పండుగలా చూపిస్తే, ఎడిటింగ్ పనితనం కూడా సమర్థవంతంగా కనిపిస్తుంది. భీమ్స్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చిత్రానికి అదనపు బలాన్ని అందించింది.
చివరగా:
మొత్తంగా.. సంక్రాంతికి ఫుల్ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం‘.
రేటింగ్: 3.25/5