'పట్టుదల' మూవీ రివ్యూ
'పట్టుదల' మూవీ రివ్యూ
నటీనటులు: అజిత్ కుమార్, త్రిష, అర్జున్, రెజీనా కసాండ్రా తదితరులు
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్: ఎన్.బి. శ్రీకాంత్
నిర్మాత: సుభాస్కరన్
దర్శకత్వం: మగిళ్ తిరుమేని
విడుదల తేది: 06-02-2025
తమిళ అల్టిమేట్ స్టార్ అజిత్ నటించిన చిత్రం ‘విడాముయార్చి‘. తెలుగులో ఈ సినిమా ‘పట్టుదల‘ పేరుతో ఈరోజు విడుదలయ్యింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత అజిత్ నుంచి వచ్చిన కొత్త సినిమా ఇది. ‘తడమ్‘ వంటి సెన్సేషనల్ థ్రిల్లర్ అందించిన మగిళ్ తిరుమేణి తెరకెక్కించడంతో ‘పట్టుదల‘ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఈ సినిమాలో అజిత్ కి జోడీగా త్రిష నటించింది. మరి.. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘పట్టుదల‘ ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
అర్జున్ (అజిత్), కయల్ (త్రిష) ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు. వారి సంసార జీవితం తొలి రోజుల్లో ఆనందంగా సాగినా, కాలక్రమేణా అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. 12 ఏళ్ల తర్వాత వాళ్ల మధ్య మనస్పర్థలు తలెత్తి విడిపోవాలనుకుంటారు. అర్జున్ ఈ విడాకులను కోరకపోయినా, కయల్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోదు.
ఈనేపథ్యంలో అర్జున్ తన భార్యను చివరిసారి ఆమె తల్లిదండ్రుల వద్దకు రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్లాలని ప్రతిపాదిస్తాడు. ఈ రోడ్ ట్రిప్ లో అనుకోని సంఘటనలతో కయల్ కిడ్నాప్ అవుతుంది. అసలు కయల్ ని కిడ్నాప్ చేసిందెవరు? ఈ కథలో రక్షిత్ (అర్జున్), దీపిక (రెజీనా) పాత్రలేంటి? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
హాలీవుడ్ మూవీ ‘బ్రేక్ డౌన్‘ ఆధారంగా రూపొందింది ‘పట్టుదల‘ చిత్రం. ఈ సినిమాని కూడా ఆద్యంతం హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ లోనే తెరకెక్కించాడు దర్శకుడు మగిళ్ తిరుమేణి. అయితే స్టైలిష్ మేకింగ్ పై దృష్టి పెట్టిన దర్శకుడు, కథను మన ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో విఫలమయ్యాడు.
ఫస్ట్ హాఫ్ పూర్తిగా అజిత్ – త్రిష మధ్య ప్రేమ, పెళ్లి, విభేదాలను చూపించడంతో కథ నెమ్మదిగా నడిచింది. కార్లో సాగే ఈ కథ మొదట్లో బోరింగ్ అనిపించినా, ఇంటర్వెల్ దగ్గర చిన్న ట్విస్ట్ ఇచ్చారు. అయితే అది అసలు ట్విస్ట్ కాదని తేలిపోవడంతో ఆసక్తి తగ్గిపోతుంది.
సెకండ్ హాఫ్ లో రక్షిత్ – దీపికల కథ, అర్జున్ తన భార్య కోసం చేసే పోరాటమే ప్రధానంగా సాగుతుంది. అయితే దీపిక – రక్షిత్ పాత్రలు కాస్త అనవసరంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగిపోగా, సెకండ్ హాఫ్ యాక్షన్, ఛేజింగ్ సీన్లతో ఆసక్తిని పెంచినా, స్క్రీన్‌ప్లే ప్రిడిక్టబుల్‌గా మారిపోవడంతో పెద్దగా ఎఫెక్ట్ కలిగించలేదు.
కథ మొత్తం అబెర్ బైజాన్‌లో సాగడం వెనుక పెద్ద కారణం లేకపోయినా, ప్రధానంగా లొకేషన్ కోసం తీసినట్టుగా అనిపిస్తుంది. అజిత్ అభిమానులు ఎప్పుడూ ఊహించే మాస్ ఎలివేషన్స్ ఈ సినిమాలో లేకపోవడం నిరాశ కలిగించవచ్చు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
అజిత్ తన స్టైల్, టైమింగ్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో మరోసారి మెప్పించాడు. ముఖ్యంగా పాత్రకు తగ్గట్టుగా వేరియేషన్స్ చూపిస్తూ, ఎమోషనల్ సన్నివేశాల్లోనూ తన హావభావాలతో ఆకట్టుకున్నాడు. అజిత్ యాక్షన్ పరంగా అసలు తగ్గలేదు. ఛేజింగ్ సీక్వెన్స్‌లో రియల్ యాక్సిడెంట్ జరిగినా, అజిత్ అందులోను హై ఎనర్జీ చూపించాడు. త్రిష తన పాత్రకు న్యాయం చేసింది. అర్జున్, రెజీనా పాత్రలకు సరైన బలమైన నేపథ్యం లేకపోవడంతో అవి అంతగా ప్రభావం చూపలేకపోయాయి.
అజిత్ పాత్రను శక్తివంతంగా డిజైన్ చేసిన దర్శకుడు మగిళ్ తిరుమేని, కథను అంతే స్థాయిలో మలచలేకపోయాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ఆసక్తికరమైన కథనాన్ని కొనసాగించడంలో ఆయన విఫలమయ్యాడు. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా, రెగ్యులర్‌గా అనిపించాయి. టెక్నికల్‌గా సినిమా హై-స్టాండర్డ్ లో ఉంది. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ హాలీవుడ్ ఫీల్ ఇచ్చింది. అనిరుధ్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్‌కు తగ్గట్టుగా ఉన్నా, ఎమోషనల్ కనెక్ట్ కలిగించలేదు. తెలుగు డబ్బింగ్ పరంగా కూడా నిరాశ కలిగించే అంశాలున్నాయి.
చివరగా
అంతగా ప్రభావం చూపించని అజిత్ ‘పట్టుదల’