‘కుటుంబస్థన్’ రివ్యూ

Update: 2025-03-12 03:00 GMT

చిత్రం: ‘కుటుంబస్థన్’

భాష : తమిళం (తెలుగు డబ్బింగ్ )

ఓటీటీ ప్లాట్‌ఫామ్: జీ 5

నటులు: మణికందన్, సాన్‌వీ మేఘనా, గురు సోమసుందరం, కనకం, సుందరరాజన్

సంగీతం: వైశాఖ్

సినిమాటోగ్రఫీ: సుజిత్ ఎన్. సుబ్రహ్మణియం

ఎడిటింగ్: కన్నన్ బాలు

దర్శకత్వం: రాజేశ్వర్ కలిసామి


‘గుడ్‌ నైట్‌, లవర్‌’ వంటి ఫీల్‌ గుడ్‌ వంటి వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రాల కథానాయకుడు మణికంఠన్‌ నటించిన తాజా చిత్రం కుటుంబస్థన్. సినిమాకారన్‌ పతాకంపై ఎస్‌. వినోద్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రానికి రాజేశ్వర్‌ కాళీసామి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఈ ఏడాది జనవరిలో థియేటర్స్ లోకి వచ్చింది. కేవలం రూ. 8 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకొని రూ. 28 కోట్లు రాబట్టిన ఈ ఈ సినిమా తాజాగా జీ 5 ఒటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చింది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా ఆడియన్స్ కు ఏ మేరకు కనెక్ట్ అయింది? అనే విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ:

నవీన్ (మణికందన్) మధ్యతరగతి వ్యక్తి. తన ప్రేయసి నీల (సాన్‌వీ మేఘనా)ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. అయితే, అతని జీవితం అనుకోకుండా మారిపోతుంది. ఉద్యోగం కోల్పోతాడు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటాడు. ఈ పరిస్థితుల్లో.. వివిధ వనరుల నుండి అప్పులు తీసుకుంటాడు. కానీ అనుకోని సమస్యల్లో చిక్కుకుంటాడు. ఈ సమస్యల వెనుక ఎవరు ఉన్నారు? నవీన్ తన జీవితాన్ని తిరిగి ఎలా సవరించుకోగలిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే సినిమా మిగతా కథ.

కథాకథనాల విశ్లేషణ:

సినిమా నవీన్ జీవితం చాలా సరదాగా ప్రారంభమవుతుంది. అతను ఒక మధ్యతరగతి యువకుడు, తన ప్రేయసిని ప్రేమించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. అతను చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించే ప్రయత్నం చేస్తుంటాడు. మొదటి 20 నిమిషాలు పూర్తిగా నవీన్-నీల మధ్య ఉన్న సరదా ప్రేమ, నవీన్ కుటుంబ సభ్యులతో అతనికున్న అనుబంధాన్ని పరిచయం చేసేలా సాగుతుంది. గురు సోమసుందరం పాత్ర ఈ సమయంలో ఎంటర్ అవుతుంది, అతని కామెడీ టైమింగ్‌తో కథలో ఆసక్తిని పెంచుతుంది. ప్రారంభ సన్నివేశాలు సరదాగా సాగుతాయి, పాత్రల పరిచయాలు సహజంగా ఉంటాయి.

ఇంటర్వెల్ ముందు పెద్ద ట్విస్ట్ .. నవీన్ ఒక వ్యక్తితో డీల్ కుదుర్చుకుంటాడు.. కానీ అది అతని జీవితాన్ని మలుపు తిప్పే పరిణామానికి దారి తీస్తుంది. ఎమోషనల్ గానూ, థ్రిల్లింగ్ మూడ్ పెంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కొన్ని సంఘటనలు కాస్త ముందే ఊహించగలుగుతున్నట్లు అనిపించవచ్చు. ఆ తర్వాత నవీన్ పడ్డ కష్టాలు, కుటుంబం కోసం పడే తాపత్రయం మెప్పిస్తాయి. ఎమోషనల్‌గా ముగింపు ఇవ్వడానికి ప్రయత్నించగా.. కొన్ని హాస్య సన్నివేశాలతో సినిమా సరదాగా ముగుస్తుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్:

కథకు నడిపించే కేంద్ర బిందువైన పాత్ర నవీన్. ఈ పాత్రను మణికందన్ తన సహజమైన అభినయంతో అద్భుతంగా పోషించాడు. అతని డైలాగ్ డెలివరీ, ముఖ్యంగా హాస్యపూరితంగా చెప్పే సందర్భాలు బాగా నచ్చాతాయి. రెండో భాగంలో ఎమోషనల్ సన్నివేశాల్లో సీరియస్ నటనను ప్రదర్శించాడు.

గురు సోమసుందరం తన కామెడీ టైమింగ్‌తో సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాల్లో అతని ఎంట్రీతో కామెడీ సన్నివేశాలు మరింత ఆకర్షణీయంగా మారతాయి. క్లైమాక్స్‌లో కూడా అతను సీరియస్ షేడ్‌లో కనిపించడం ఆసక్తికరం. ఇక మణికందన్ భార్యగా కనిపించే నీల పాత్రలో సాన్‌వీ మేఘనా సహజంగా నటించింది. చాలా కీలకమైన ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నటన మెప్పిస్తుంది. కనకం, సుందరరాజన్.. వీరిద్దరూ ముఖ్యమైన క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్నా.. వారి పాత్రలు సినిమా గమనాన్ని ఎంతో ప్రభావితం చేయలేదు. కామెడీ పరంగా కొన్ని చోట్ల ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు రాజేశ్వర్ కలిసామి తనదైన శైలి లో హాస్యాన్ని, కుటుంబ భావోద్వేగాలను సమపాళ్లలో మేళవించారు. కానీ.. స్క్రీన్‌ప్లే మరింత పకడ్బందీగా ఉండాల్సింది. కుటుంబ నేపథ్యం ఉన్న కథకు తగినట్లుగా కెమెరా వర్క్ ఉంది. సహజమైన ఫ్రేమింగ్‌తో కథను ఆకర్షణీయంగా చూపించారు. ఇంక సినిమాకు సాధారణ స్థాయి మ్యూజిక్ ఉంది. కానీ పాటలు పెద్దగా గుర్తుండిపోయేలా లేవు.

ప్లస్ పాయింట్లు:

మణికందన్ నాటనా ప్రతిభ

గురు సోమసుందరం కామెడీ:

హాస్యభరిత కుటుంబ కథనం

సామాజిక సందేశం

మైనస్ పాయింట్లు:

ఎమోషన్స్ అంత బాగా పలకలేదు

తెలుగు డబ్బింగ్ లోపాలు

చివరిగా:

‘కుటుంబస్థన్’ ఒక సరదా కుటుంబ కథా చిత్రం. మధ్య తరగతి కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యలను హాస్యంతో మేళవించి చెప్పిన సినిమా ఇది. మణికందన్, గురు సోమసుందరం నటన, కొన్ని హాస్యసన్నివేశాలు బాగున్నాయి. కానీ నెమ్మదిగా సాగే కథనం. మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే మూవీ ‘కుటుంబస్థన్’.

Tags:    

Similar News