'కుబేర' రివ్యూ
ఇప్పటివరకూ స్టార్స్ వైపు పెద్దగా దృష్టిపెట్టని శేఖర్ ఈసారి నాగార్జున-ధనుష్-రష్మిక వంటి స్టార్స్ తో తెరకెక్కించిన చిత్రం 'కుబేర'.;
నటీనటులు: నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా, జిమ్ సర్బ్, దలీప్ తాహిల్, కల్నల్ రవి శర్మ, సునయన తదితరులు
సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిరెడ్డి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
విడుదల తేది: జూన్ 20, 2025
కాంబినేషన్స్ కంటే కథనే నమ్ముకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పటివరకూ స్టార్స్ వైపు పెద్దగా దృష్టిపెట్టని శేఖర్ ఈసారి నాగార్జున-ధనుష్-రష్మిక వంటి స్టార్స్ తో తెరకెక్కించిన చిత్రం 'కుబేర'. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. పాన్ ఇండియా లెవెల్ లో ‘కుబేర‘ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ‘కుబేర‘ మూవీ ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
దీపక్ (నాగార్జున) ఒక నిజాయితీగల సీబీఐ అధికారి. అయితే అదే నిజాయితీ కారణంగా అతన్ని కొన్ని రాజకీయ శక్తులు, కార్పొరేట్ మాఫియా కలిసి తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకి పంపిస్తాయి. మరోవైపు నీరజ్ మిత్ర (జిమ్ సర్భ్) అనే పారిశ్రామికవేత్త దేశ భవిష్యత్తును పణంగా పెట్టే భారీ స్కెచ్ వేస్తాడు. దేశానికి కొన్నేళ్లపాటు సరిపడే చమురు నిల్వలను రహస్యంగా కొట్టేసే ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులను కొనుగోలు చేసి, రహస్యంగా తన ప్రయోజనాలకు ఉపయోగించాలనుకుంటాడు. ఈ మిషన్‌ను ముందుకు నడిపించేందుకు అతడికి దీపక్ అవసరం అవుతాడు. జైలు నుంచి దీపక్‌ను విడుదల చేయిస్తాడు.
అలా బయటికి వచ్చిన దీపక్ ఈ డీల్‌ని పూర్తి చేసేందుకు నీరజ్‌కి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని వెతికి పట్టుకుంటాడు. రూ.1 లక్ష కోట్లను నాలుగు బినామీ ఖాతాల ద్వారా సేఫ్ జోన్‌కి తరలించే ప్లాన్ వేస్తాడు. ఆ నలుగురిలో ఒకడు దేవా (ధనుష్). అయితే అక్షరం ముక్క రాని దేవా.. వీళ్ల డీల్ గురించి ఎలా తెలుసుకుంటాడు? తెలిసిన తర్వాత దేవాని వీళ్లు వదిలేశారా? దేవాకి.. సమీర (రష్మిక మందన) ఎందుకు సాయం చేస్తుంది. చివరికి ఏమవుతుంది అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
‘ఫిదా, లవ్ స్టోరీ‘ వంటి ప్రేమకథా చిత్రాల తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఓ ఇంటెన్స్ స్టోరీ ‘కుబేర‘. హృదయాన్ని తాకే కథతో, క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ‘కుబేర‘తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు శేఖర్ కమ్ముల. మూడు గంటల సినిమాను కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా నడిపించడం అంత సులువు కాదు. కానీ శేఖర్ తన ప్రత్యేకమైన స్టైల్‌తో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేసి చూపించాడు.
ధనవంతుడు – పేదవాడు కాన్సెప్ట్ చాలా సినిమాల్లోనో చూశాం. కానీ ‘కుబేర’లో శేఖర్ కమ్ముల దీనిని తనదైన శైలిలో కొత్తగా చెప్పాడు. డబ్బు అన్నదే ఊపిరిగా బ్రతికే ఓ బిజినెస్ మెన్, నిజాయితీకి పరమ నమ్మకంగా ఉండే ఓ మాజీ సీబీఐ ఆఫీసర్, జీవితంలో తానెవరో తెలీని ఓ బిచ్చగాడు మధ్య నడిచే కథ ఇది.
లక్ష కోట్ల స్కామ్ నేపథ్యంలో డబ్బున్న వాళ్ళు, దాని కోసం బ్రతికే వాళ్ళు, దాన్ని నిందిస్తూ జీవించే వాళ్ళ మధ్య నడిచే ఈ కథలో ఎమోషన్, హ్యూమన్ వేల్యూస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. శేఖర్ కమ్ముల మార్క్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాను స్పెషల్ గా నిలిపింది.
ప్రధానంగా చెప్పాలనుకున్న థీమ్‌కు న్యాయం చేయడంలో దర్శకుడు చాలా వరకూ విజయవంతమయ్యాడు. కథలోని కొన్ని కీలక సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా, భావోద్వేగపూరితంగా కనిపించాయి. అయితే, మొత్తం సినిమా నిడివి అదే స్థాయి హైప్‌ను నిలబెట్టడంలో మాత్రం కొంత విఫలమైందని చెప్పొచ్చు.
ముఖ్యంగా నాగార్జున – విలన్ల మధ్య సీన్లు మరింత పవర్‌ఫుల్‌గా ఉండి ఉంటే మరింత ఇంపాక్ట్ కలిగించేవి. కొన్ని సన్నివేశాల్లో కథనం కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది. అయినప్పటికీ, దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పాలనుకున్న భావనను స్పష్టంగా వెల్లడించిన విధానం ప్రశంసనీయమే. చిన్నచిన్న లోపాలున్నా, భావోద్వేగాలకు పెద్ద పీట వేసిన ఈ సినిమా ఎమోషనల్‌గా కనెక్ట్ కావడంలో విజయం సాధించింది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు:
ధనుష్ ఓ బిచ్చగాడిగా ‘దేవ్’ పాత్రలో విశేషంగా నటించాడు. ధనుష్ తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నాగార్జున నిజాయితీగల సీబీఐ ఆఫీసర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రష్మిక మందన్నా తన సున్నితమైన నటనతో ఆకట్టుకుంది. జిమ్ సర్బ్ విలన్‌గా రిఫ్రెషింగ్ గా కనిపించాడు. ఈ సినిమాలో ప్రతీ క్యారెక్టర్ కు ఒక ప్రత్యేకత ఉంది.
సాంకేతిక విభాగాల్లో ఈ చిత్రం అద్భుతంగా మెప్పించింది. దర్శకుడు శేఖర్ కమ్ముల, రచయితగా కూడా మంచి పనితనాన్ని చూపించామగ. విభిన్నమైన పాత్రలు, బలమైన కథతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. అయితే కొన్ని చోట్ల కథనాన్ని మరింత బలంగా మలిచి ఉంటే బాగుండేది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మిరెడ్డి విజువల్స్ సినిమాకి మరో బలం. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అత్యున్నతంగా ఉన్నాయి.
చివరగా:
డబ్బు చుట్టూ తిరిగే ‘కుబేర‘
Telugu 70mm Rating: 3.25 / 5