'కేసరి చాప్టర్ 2' సినిమా రివ్యూ

భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని శోధించే ప్రతి చరిత్రకారుడి మనసును కలిచే సంఘటన – జలియన్‌వాలా బాగ్ ఉదంతం. వందల మంది అమాయకుల రక్తంతో చెరిపిన ఆ రోజు, ఇప్పటికీ భారతదేశ గుండెల్లో గాయం లాంటిదే.;

By :  S D R
Update: 2025-04-19 14:09 GMT

నటీనటులు: అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్, అనన్య పాండే, రెజీనా కసాండ్రా తదితరులు

సినిమాటోగ్రఫీ: దేబోజిత్ రే

సంగీతం: సాష్వత్ సచ్‌దేవ్

ఎడిటింగ్ : నితిన్ బేద్

నిర్మాతలు: హీరూ యష్ జోహర్, అరుణా భాటియా, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, అమృత్ పాల్ సింగ్ బింద్రా, ఆనంద్తి వారీఫిల్మ్స్

దర్శకత్వం: కరణ్ సింగ్ త్యాగి

విడుదల తేది: ఏప్రిల్ 18, 2025

భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని శోధించే ప్రతి చరిత్రకారుడి మనసును కలిచే సంఘటన – జలియన్‌వాలా బాగ్ ఉదంతం. వందల మంది అమాయకుల రక్తంతో చెరిపిన ఆ రోజు, ఇప్పటికీ భారతదేశ గుండెల్లో గాయం లాంటిదే. అలాంటి జలియన్‌వాలా బాగ్ ఉదంతం ఇతివృత్తంగా రూపొందింది 'కేసరి చాప్టర్ 2'.

అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి‘ ఫ్రాంఛైజ్ లో ఈ చిత్రం వచ్చింది. 'కేసరి' కథకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఆ ఫ్రాంఛైజ్ లో ఈ సినిమా వచ్చింది. ఈ చిత్రానికి ‘అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్‘ అనేది ట్యాగ్ లైన్. ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కేసరి చాప్టర్ 2' సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ ప్రత్యేకమైన దుఃఖఘట్టం. వందల మంది నిరపరాధులపై విచక్షణలేని కాల్పులు జరిపిన ఈ దారుణానికి కారణమైన జనరల్ డయ్యర్‌పై కేసు వేస్తాడు న్యాయవాది శంకరన్ నాయర్(అక్షయ్ కుమార్). ఇది చరిత్రలో అరుదైన చర్య. ఈ సాహసోపేత నిర్ణయం అప్పటి కాలానికి విపరీతంగా ప్రమాదకరమైనదైనా, నాయర్ వెనక్కి తగ్గడు.

ఈ పోరాటంలో శంకరన్‌కి తోడుగా నిలిచిన యువ న్యాయవాది దిల్‌రీత్ గిల్ (అనన్య పాండే). నాయర్ వాదనలకు ఎదురుగా నిలబడే ఆంగ్లో ఇండియన్ న్యాయవాది నెవిల్లే మెక్ కిన్లీ (ఆర్.మాధవన్). మరి.. జలియన్‌వాలా బాగ్ ఉదంతం విషయంలో శంకరన్ నాయర్ ఎలాంటి నిజాలు బయటపెట్టాడు? చివరకు ఆ కేసు ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ

చరిత్రలోని అంశాలను తెరపై ఆవిష్కరించడంలో అత్యంత బాధ్యతతో కూడిన పాత్ర దర్శకుడిదే. ముఖ్యంగా హిస్టారికల్ నేపథ్యం కల కథలను ఎంచుకున్నప్పుడు, వాస్తవాలను గౌరవిస్తూ నడవాల్సిన అవసరం ఉంటుంది. ఈ బాధ్యత విషయంలో దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి కొంతవరకూ సక్సెస్ అయ్యాడు. అయితే స్వాతంత్ర్య ఉద్యమంలోని చారిత్రక సంక్లిష్టతను పట్టించుకోకుండా, కోర్ట్ రూమ్ డ్రామాకే ప్రాధాన్యత ఇవ్వడం మాత్రం నిరుత్సాహ పరుస్తుంది.

అక్షయ్ కుమార్ నాయర్ పాత్రలో సరిపోయాడు. అయితే నాయర్ రాజకీయ జీవితాన్ని, భారత జాతీయ కాంగ్రెస్‌లో ఆయన పాత్రను పూర్తిగా విస్మరించడం వల్ల, పాత్ర పరిమితిగా మిగిలిపోయింది. ఇక మాధవన్ వంటి బహుముఖ ప్రజ్ఞ కలిగిన నటుడిని నటన పరంగా మరింతగా ఉపయోగించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం కలుగుతుంది. ఆయన పాత్రలో ఉన్న భావోద్వేగాలు ఆకట్టుకున్నప్పటికీ.. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ లలో ఆయనకు తగిన స్థాయి ప్రాధాన్యం లేకపోవడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. అలాగే ముగింపు మరింత ఉత్కంఠతో ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

అక్షయ్ కుమార్ శంకరన్ నాయర్ పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నాడు. అతని డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సన్నివేశాల్లో నటన, కోర్టు సన్నివేశాల్లో తీవ్రత సినిమాకు ప్రధాన ఆకర్షణ. మాధవన్, అనన్య పాండే కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. రెజీనా పాత్ర పరిమితంగానే ఉన్నా ఉన్నంతలో బాగా చేసింది.

కోర్టు రూమ్ డ్రామాకు హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌ను జోడించడం ద్వారా దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి కథనానికి కొత్తదనాన్ని తీసుకొచ్చాడు. సాష్వత్ సచ్‌దేవ్ అందించిన నేపథ్య సంగీతం కథనానికి బలాన్ని చేకూర్చింది. విజువల్స్ పరంగా చూస్తే, సినిమాటోగ్రఫీ పనితనం ప్రత్యేకంగా గుర్తించదగ్గది.

చివరగా

'కేసరి చాప్టర్ 2'.. జలియన్‌వాలా బాగ్ న్యాయపోరాటం

Tags:    

Similar News