'జాట్' రివ్యూ
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్, తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించిన భారీ మాస్ యాక్షన్ మూవీ ‘జాట్’.;
నటీనటులు: సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా కసాండ్రా, సయామి ఖేర్, స్వరూప ఘోష్ తదితరులు.
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ
సంగీతం: తమన్ ఎస్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, టిజి విశ్వ ప్రసాద్
దర్శకత్వం: గోపీచంద్ మలినేని
విడుదల తేది: 10-04-2025
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్, తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించిన భారీ మాస్ యాక్షన్ మూవీ ‘జాట్’. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న హిందీలో విడుదలైంది. తెలుగు అగ్ర నిర్మాణ సంస్థలు, తెలుగు దర్శకుడు తెరకెక్కించిన 'జాట్' ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
రణతుంగా (రణ్‌దీప్ హుడా), సోములు (వినీత్ కుమార్ సింగ్) అనే ఇద్దరు అరాచకులు అనేక గ్రామాలను గుప్పిట్లో పెట్టుకొని ప్రజల జీవితాలను నరకంగా మారుస్తారు. భయం అలా బుసలు కొడుతుంది. తల్లులు, భార్యలు కూడా రణతుంగా పేరు వినగానే వణికిపోతారు.
అలాంటి చీకటి రాజ్యంలోకి జాట్ (సన్నీ డియోల్) అడుగుపెడతాడు. అతడి నిశ్శబ్ద ధైర్యం ప్రజల్లో ఆశ నింపుతుంది. చివరికి తెలుస్తుంది అతను దేశానికి సేవ చేసిన బ్రిగేడియర్ బల్బీర్ ప్రతాప్ సింగ్ అని. మరి.. రాజకీయ నాయకులు, పోలీసులను తమ గుప్పిట్లో పెట్టుకున్నరణతుంగా సోదరుల సామ్రాజ్యాన్ని జాట్ ఎలా ఎదుర్కొన్నాడు అనేదే కథ.
విశ్లేషణ
దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని యాక్షన్, మాస్ మసాలా, భావోద్వేగాల మేళవింపుతో రూపొందించాడు. తెలుగువారికి ఇది పరిచయమైన స్టైల్ అయినా, ఉత్తరాదివారిని ఆకట్టుకునే నేరేషన్, క్యారెక్టర్స్, కంటెంట్‌తో సినిమా సాగుతుంది.
బాలీవుడ్ బాక్సాఫీస్‌కి మళ్లీ సన్నీ డియోల్ పవర్‌ను గుర్తు చేసిన చిత్రం ‘జాట్’. ‘గదర్ 2’ తర్వాత ఆయనలో ఇంకా ఫైటింగ్ స్పిరిట్ తగ్గలేదని మరోసారి రుజువు చేసింది ఈ సినిమా. సన్నీ డియోల్ కోసం డిజైన్ చేసిన బల్బీర్ ప్రతాప్ సింగ్ పాత్ర ద్వారా ఎన్నో ఎమోషన్స్ ను ఆవిష్కరించాడు మలినేని. ముఖ్యంగా కథానాయకుడి నిజాయితీ, ధైర్యం, సమాజం పట్ల బాధ్యత అనే అంశాలు జాట్ పాత్రలో అద్భుతంగా చూపించాడు.
అయితే ఫస్టాఫ్ లో కనిపించిన థ్రిల్, ఎమోషన్.. సెకండాఫ్ లో అంతగా అనిపించలేదు. ఇది కథను కొంచెం వెనక్కి లాగినట్టైంది. అయినా కూడా, సన్నీ డియోల్ నటన మాత్రం సినిమా మొత్తానికి బ్యాక్‌బోన్ అని చెప్పొచ్చు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
టైటిల్ రోల్ లో సన్నీ డియోల్ తన శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాడు. 'ఘయల్, ఘాతక్, గదర్, గదర్ 2' వంటి చిత్రాల్లోని తన శైలిని 'జాట్' కోసం మరొక్కసారి ప్రదర్శించాడు సన్నీ డియోల్. రణతుంగా పాత్రలో భయానక ప్రతినాయకుడిగా కనిపించి, తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందాడు రణదీప్ హుడా.
సోములు పాత్రలో విలన్ గా వినీత్ కుమార్ సింగ్ తన ప్రతిభను చూపించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇంకా రేణుకా పాత్రలో రెజీనా అందం, చురుకుతనం కలగలిపి సినిమాకి ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చింది. సయ్యామి ఖేర్ కి దక్కింది తక్కువ స్క్రీన్ టైమ్ అయినా ఆ పాత్రకు న్యాయం చేసింది. జగపతిబాబు, రమ్యకృష్ణ తమ పాత్రలలో ఒదిగిపోయారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని కథ, కథనం, క్యారెక్టరైజైన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ను అద్భుతంగా ఆవిష్కరించి పక్కా కమర్షియల్ ప్యాకేజ్ ను అందించాడు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జాట్ ను ఓ రేంజులో ఎలివేట్ చేసింది.
టెక్నికల్ గా రిషి పంజాబీ కెమెరా ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. అనల్ అరసు, రామ్ లక్ష్మణ్, వెంకట్ రూపొందించిన యాక్షన్ సీక్వెన్సెస్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు ప్రొడక్షన్ వేల్యూస్ ప్రతీ ఫ్రేములోనూ స్పష్టంగా కనిపిస్తాయి.
చివరగా
'జాట్'.. సన్నీ డియోల్ మాస్ జాతర!