‘ఐటెంటిటీ’ మూవీ రివ్యూ

టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన "ఐడెంటిటీ" ఈ ఏడాది బోణీ కొట్టిన సినిమాగా నిలిచింది.;

By :  K R K
Update: 2025-01-24 07:56 GMT

చిత్రం : ఐడెంటిటీ

విడుదల తేదీ : 24, జనవరి 2025

నటీనటులు : టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్ తదితరులు

సంగీతం : జేక్స్ బిజాయ్

నిర్మాతలు : రాజు మల్లాయిత్ - రాయ్ సి.జె

దర్శకత్వం : అఖిల్ పాల్ - అనాస్ ఖాన్

2024లో అత్యధిక విజయాలు సాధించిన మాలీవుడ్ 2025లో కూడా అదే జోరు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన "ఐడెంటిటీ" ఈ ఏడాది బోణీ కొట్టిన సినిమాగా నిలిచింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ అదే పేరుతో ఈ రోజే తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ:

హరన్ శంకర్ (టోవినో థామస్) చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, కఠినమైన తండ్రి పెంపకానికి అలవాటు పడి ఓసీడీ లక్షణాలతో పెరుగుతాడు. అతని స్ట్రిక్ట్ పర్సనాలిటీ కారణంగా ఎన్.ఎస్.జి కమాండోగా చేరి, తరువాత స్కై మార్షల్ అవతారం ఎత్తుతాడు. అయితే, బెంగళూరులో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసు విషయంలో కేరళకు వచ్చిన అలెన్ జాకోబ్ (వినయ్ రాయ్) ఈ కథలో కీలక పాత్రధారిగా మారుతాడు. ఈ కేసులో ప్రధాన సాక్షి అలీషా (త్రిష), జరిగిన ప్రమాదం కారణంగా గుర్తింపు సమస్యలతో బాధపడుతూ ఉంటుందనేది కథలో కొత్త మలుపు. హరన్ ఈ కేసును ఛేదించేందుకు ముందుకు రాగా, ఊహించని రహస్యాలు బయటికొస్తాయి. అసలు అలెన్ జాకోబ్ ఎవరు? అతనికి హరన్‌తో ఉన్న సంబంధమేంటి? ఈ కథలో అలీషా పాత్ర ఎంత ప్రాధాన్యత కలిగింది? అనే ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమే “ఐడెంటిటీ” చిత్రం.

నటీనటుల ప్రదర్శన:

టోవినో థామస్ పాత్రలో ఒదిగిపోయి.. ఓసీడీ లక్షణాలతో ఉన్న వ్యక్తిగా తన ప్రతిభను చాటుకున్నాడు. యాక్షన్ సన్నివేశాల్లో టోవినో మ్యానరిజమ్స్ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. వినయ్ రాయ్, విలన్ పాత్రలో మరోసారి ప్రభావవంతమైన ప్రదర్శన ఇచ్చాడు. “డాక్టర్” తర్వాత అతనికి పడిన మంచి పాత్ర ఇదేనని చెప్పవచ్చు. త్రిష పాత్రకు పరిమిత స్క్రీన్ టైమ్ ఇచ్చారు. కానీ ఆమె క్యారెక్టర్ ఆకట్టుకునేలా ఉంది. మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

సాంకేతిక విభాగం:

జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రాణం అని చెప్పవచ్చు. ప్రతి సన్నివేశాన్ని గొప్పగా ఎలివేట్ చేశాడు. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ టాప్ లెవెల్‌లో ఉంది. ఫ్యాక్టరీ బ్లాస్ట్ సీక్వెన్స్, షార్ప్ యాక్షన్ షాట్స్ చక్కగా పిక్చరైజ్ చేశారు.

దర్శకత్వం

అఖిల్ పౌల్ – అనాస్ ఖాన్ దర్శకత్వ ద్వయం కథను ఆసక్తికరంగా ఆరంభించారు. హీరో ఎలివేషన్స్ కోసం చేసిన యాడిషనల్ ఎపిసోడ్స్ మెప్పిస్తాయి. త్రిష పాత్రలో ఇంకాస్త డ్రామా జోడించి కథను బలంగా తీసుకు వెళ్ళి ఉంటే సినిమా ఇంకా బాగుండేది.

విశ్లేషణ:

“ఐడెంటిటీ” ఒక మంచి కథకు సిగ్నేచర్ స్టైలిష్ టేకింగ్‌తో ప్రాణం పోసిన చిత్రం. అయితే.. కథలోని కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో ఎలివేట్ చేయలేకపోయిన కారణంగా కొంతమేర డిసప్పాయింట్ చేస్తుంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉన్నా.. ఫస్టాఫ్‌లో “ప్రసన్న వదనం” లాంటి ఫీల్ కలగడం విశేషం. క్లైమాక్స్‌లోని ఫైట్ సీక్వెన్స్ సినిమా క్రెడిబిలిటీని తగ్గించినప్పటికీ, సినిమాటోగ్రఫీ, బిజోయ్ సంగీతం, టోవినో ప్రదర్శన ప్రేక్షకులను ఓ మోస్తరు స్థాయిలో మెప్పిస్తాయి.

మొత్తం మీద “ఐడెంటిటీ” సినిమా స్టైలిష్ ప్రెజెంటేషన్, ఆసక్తికరమైన మలుపులతో ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ మూవీస్ అభిరుచితో ఉన్నవారికి ఈ సినిమా మంచి ఆప్షన్.

Tags:    

Similar News