'కోర్ట్' రివ్యూ
చిత్రం:కోర్ట్
నటీనటులు: శివాజీ, ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి ఆపల్లా తదితరులు.
సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ ఆర్
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
దర్శకత్వం: రామ్ జగదీష్
విడుదల తేది: 14-03-2025
ఒకవైపు హీరోగా అలరిస్తూనే మరోవైపు నిర్మాతగా అభిరుచి గల చిత్రాలను నిర్మిస్తున్నాడు నాని. తాజాగా నాని నిర్మాణం నుంచి వచ్చిన చిత్రం 'కోర్ట్'. ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, శివాజీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం రేపు (14-03-25) థియేటర్లలో రాబోతుంది. అయితే ముందుగా ఈ చిత్రాన్ని ప్రీమియర్స్ గా ప్రదర్శించారు. మరి.. 'కోర్ట్' ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
మంగపతి (శివాజీ) పరువునే ప్రాణంగా భావించే వ్యక్తి. అతని కుటుంబానికి చెందిన జాబిలీ (శ్రీదేవి అపల్లా) పేదవాడైన చందు (హర్ష రోషన్)ను ప్రేమిస్తుంది. అయితే, జాబిలీ మైనర్ కావడంతో మంగపతి ఈ ప్రేమ వ్యవహారాన్ని పెద్దదిగా చేసి, చందుపై 'పోక్సో' వంటి తీవ్రమైన కేసులు పెట్టించి అతన్ని ఇరికించేందుకు ప్రయత్నిస్తాడు.
చందు పేద కుటుంబం నుంచి వచ్చాడనే కారణంగా ఎవ్వరూ అతనికి న్యాయం చేయడానికి ముందుకు రారు. ముందుకు వచ్చినవారిని మంగపతి తన అధికారంతో, లంచాలతో వశపరుచుకుంటాడు. ఈ క్రమంలో ఈ కేసును వాదించేందుకు జూనియర్ లాయర్ సూర్య తేజ (ప్రియదర్శి) ముందుకు వస్తాడు.
న్యాయవ్యవస్థలోని అవినీతి, సామాజిక వివక్షల మధ్య సూర్య తేజ తన నైతిక విలువలను పాటిస్తూ, చందును నిర్దోషిగా నిలిపించడానికి ఎలా పోరాడాడు? ఎలాంటి వాదనలు చేశాడు? అతనికి ఎదురైన సమస్యలు ఏమిటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
'కోర్ట్' సినిమా ప్రధానంగా టీనేజ్‌లో పుట్టే ప్రేమ కారణంగా ఎదురయ్యే సమస్యలు, పేదవాళ్లకు న్యాయవ్యవస్థలో ఎదురయ్యే వివక్ష అనే అంశాలను స్పృశిస్తూ, వీటిని బలమైన పాత్రల సంఘర్షణల ద్వారా ఆవిష్కరించింది.
పోక్సో కేసులో నిందితుడికి శిక్ష ఖరారు చేస్తున్న సన్నివేశంతో సినిమా ప్రారంభమవుతుంది. కథ సాగుతున్న క్రమంలో లాయర్ కేసును నడిపే తీరుతో పాటు కేసు వెనుక ఉన్న పూర్వాపరాలు అద్భుతంగా చిత్రీకరించబడ్డాయి.
కథ 2013 సంవత్సరానికి వెళ్లి, టీనేజ్ ప్రేమకథను చూపిస్తుంది. ఈ ప్రేమ కథను అసభ్యతకు తావు లేకుండా క్యూట్‌గా ప్రజెంట్ చేయడం ప్రత్యేక ఆకర్షణ. ఇక కథలోకి మంగపతి క్యారెక్టర్ ప్రవేశించిన దగ్గర నుంచి సినిమా మరింత సీరియస్ టోన్‌లోకి మారుతుంది. డబ్బు, సామాజిక అసమానతల నేపథ్యంలో ఒక నిర్దోషి యువకుడిపై తప్పుడు పోక్సో కేసు పెట్టడం వంటి అంశాలు, మన సమాజంలోని అసమతుల్యతలను స్పష్టంగా చూపించాయి.
సినిమా ప్రధానంగా పోక్సో చట్ట దుర్వినియోగం అనే అంశంపై దృష్టి పెడుతుంది. మన దేశంలో చట్టాలను ఎవరైనా తమకు అనుకూలంగా వాడుకునే పరిస్థితి ఉందని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం జరిగింది. చట్టాల గురించి విద్యార్థి దశలోనే అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని దర్శకుడు నొక్కిచెప్పిన విధానం సమర్థనీయంగా ఉంది.
లాయర్‌గా ప్రియదర్శి వాదించే తీరు ఆసక్తిని రేకెత్తించేలా ఉంటుంది. కోర్టు హాలు సన్నివేశాలు చాలా గ్రిప్పింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు రామ్ జగదీష్ రాసుకున్న కోర్టు ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఫ్యామిలీ సెంటిమెంట్, టీనేజ్ ప్రేమను సమపాళ్లలో మిళితం చేస్తూ, ప్రేక్షకులను కదిలించేలా రూపొందించారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు:
ఈ కథలో మంగపతి (శివాజీ) కీలక పాత్ర పోషించాడు. పరువు కోసం ఏమైనా చేసే వ్యక్తిగా, అతని తీరుతో కథ నడుస్తుంది. శివాజీ తన పాత్రలో ఒదిగిపోయి, అసాధారణమైన నటనను ప్రదర్శించాడు. మరోవైపు ప్రియదర్శి లాయర్ సూర్య తేజ పాత్రలో న్యాయవ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపించేలా, నిజమైన భావోద్వేగాలతో నటించాడు. హర్ష రోషన్, శ్రీదేవి టీజర్ లవర్స్ గా అలరించారు. రోహిణి తల్లి పాత్రలో అత్యద్భుతమైన నటనను కనబరిచింది.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ విషయానికొస్తే, డైలాగ్ రైటింగ్ ఈ సినిమాకు హైలైట్. ఆలోచింపజేసే సంభాషణలు, భావోద్వేగాలను కదిలించే మాటలు ప్రేక్షకుల మనసును తాకేలా రాసిన తీరు ప్రశంసించదగినది. విజయ్ బుల్గానిన్ సంగీతం ఈ సినిమాకు అసలు ప్రాణం. పాటలు మాత్రమే కాకుండా నేపథ్య సంగీతం కూడా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల మనసును హత్తుకునేలా ఉంది. ఇక సినిమాకు సరిపోయే మూడ్‌ను సెట్ చేసి, విజువల్‌గా ఆకర్షణీయంగా సినిమాటోగ్రఫీ ఉంది. వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి.
చివరగా:
‘కోర్ట్’.. ఎమోషనల్ కోర్ట్ డ్రామా!