'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి' రివ్యూ

బుల్లితెర క్రేజీ యాంకర్ ప్రదీప్ హీరోగా, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ‘జబర్దస్త్‘ బ్యూటీ దీపికా పిల్లి హీరోయిన్ గా రూపొందిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి‘.;

By :  S D R
Update: 2025-04-11 14:39 GMT

నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జి ఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ తదితరులు

సినిమాటోగ్రఫీ: ఎన్‌ బాలిరెడ్డి

సంగీతం: రథన్‌

ఎడిటింగ్‌: పీకీ

నిర్మాతలు: మాంక్స్ అండ్ మంకీస్

దర్శకత్వం: నితిన్‌-భరత్‌

విడుదల తేది: 11-04-2025

బుల్లితెర క్రేజీ యాంకర్ ప్రదీప్ హీరోగా, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ‘జబర్దస్త్‘ బ్యూటీ దీపికా పిల్లి హీరోయిన్ గా రూపొందిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి‘. ఈ చిత్రాన్ని జబర్దస్త్ కామెడీ షో డైరెక్టర్స్ నితిన్, భరత్‌ లు తెరకెక్కించడం మరో విశేషం. బుల్లితెర టాలెంట్ అంతా కలిసి పనిచేసిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి‘ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ఈ సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ

కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) యువ సివిల్ ఇంజినీర్‌. ప్రభుత్వ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాల్లో శుభ్రత కోసం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సిన పని అతనికి అప్పగించబడుతుంది. ఈ క్రమంలో, డ్రైవర్ బిలాల్ (సత్య)తో కలిసి అతను భైరిలంక అనే ఊరు చేరతాడు.

భైరిలంక ఊరు అనేది సాధారణమైన గ్రామంలా అనిపించదు. అక్కడి ప్రజల జీవన విధానం, ఆచారాలు, నమ్మకాలు అన్నీ విభిన్నంగా ఉంటాయి. దశాబ్దాలుగా సర్పంచ్‌ పదవిని రాజన్న (జీఎమ్‌ సుందర్‌) కుటుంబంలో వ్యక్తులే నిర్వహిస్తూ ఉంటారు. ప్రజల శ్రేయస్సే తన ధ్యేయంగా జీవించే ఆయనకు, గ్రామంలో మగ పిల్లలే పుడుతుండటం ఒక విచిత్రంగా అనిపిస్తుంది. అయితే, 60 మంది మగబిడ్డల తర్వాత ఆ ఊరిలో రాజా (దీపికా పిల్లి)పుడుతుంది. రాజా పుట్టిన తర్వాత గ్రామంలో అనేక శుభ పరిణామాలు చోటుచేసుకోవడంతో ఆమెను అదృష్ట దేవతగా పరిగణిస్తారు.

రాజా పెరిగాక, గ్రామం దాటి బయటకు వెళ్లకుండా, ఆ ఊరిలోనే ఉన్న యువకుల్లో ఒకరిని వివాహం చేసుకోవాలని రాజన్న నిర్ణయం తీసుకుంటాడు. రాజా ఎవరిని పెళ్లి చేసుకుంటే, అతడే గ్రామ సర్పంచ్ అవుతాడని, తన ఆస్తి అంతా అతనిదేనని ప్రకటిస్తాడు. దీంతో గ్రామ యువకులందరూ ఆమెను గెలవాలన్న పోటీలో దిగుతారు.

అలాంటి సమయంలో అక్కడకి వచ్చిన కృష్ణ (ప్రదీప్), రాజా (దీపిక)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. మరి.. 60 మంది యువకుల పోటీని తట్టుకుని కృష్ణ-రాజా ఎలా ముందుకెళ్లిందన్నది మిగతా కథ.

విశ్లేషణ

భైరిలంక అనే ఊరిని నేపథ్యంగా తీసుకుని, అక్కడి నాయకుడు రాజన్న చుట్టూ తిరిగే కథ ఇది. ఆ గ్రామంలో అందరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించడం.. ఈ నేపథ్యంలో వచ్చే కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు దర్శకులు.

కృష్ణగా ప్రదీప్ ఎంట్రీ ఇవ్వగానే కథకు మలుపు వస్తుంది. అతనితో పాటు బిలాల్‌గా సత్య, గ్యాంగ్‌లో పనోడి పాత్రలో గెటప్‌ శ్రీను చక్కగా నటించారు. వీరి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాకు అసలైన బలంగా నిలుస్తాయి. స్క్రీన్‌పై వీరి పంచ్‌లకు, టైమింగ్‌కు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతారు.

దీపికా పిల్లి–ప్రదీప్ జోడీ బాగా వర్కౌట్ అయింది. వారి రహస్య సమావేశాలు ఆసక్తికరంగా సాగతాయి. వెన్నెల కిషోర్‌, బ్రహ్మానందం చిన్నపాటి పాత్రల్లో కనిపించి అలరించారు. దర్శకులు ఫస్టాఫ్ లో కామెడీ, లవ్ స్టోరీతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగారు. కానీ ఆ ప్రపంచంలో ప్రేక్షకుడు పూర్తిగా లీనమయ్యే స్థాయికి తీసుకెళ్లలేకపోయారు. ఇంటర్వెల్‌ తర్వాత సినిమా ఊపు తగ్గుతుంది. సిటీకి వెళ్లిన తర్వాత పంచ్‌లు, వినోదం తక్కువవుతాయి. క్లైమాక్స్ కూడా ఆశించిన స్థాయిలో లేదు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

ఇంజనీర్‌ కృష్ణగా ప్రదీప్ ఆకట్టుకున్నాడు. ఒక సాధారణ ఇంజినీర్ అయిన కృష్ణగా తన పాత్రలో ప్రదీప్ ఒదిగిన తీరు స్పష్టంగా కనిపించింది. రాజా పాత్రలో దీపిక ఆకట్టుకుంది.

సత్య, గెటప్‌ శ్రీను తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పంచారు. సత్య తన టైమింగ్‌తో మెప్పించగా, గెటప్ శ్రీను తన గెటప్స్, హావభావాలతో నవ్వులు పంచాడు. వారి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. సెకండాఫ్‌లో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌ వంటి కామెడీ మాస్టర్లు వచ్చి తమ శైలిలో కాసిన్ని నవ్వులు పంచారు.

నితిన్-భరత్ దర్శక ద్వయం తమ దృష్టిని ప్రధానంగా కామెడీ ట్రాక్స్ పై ఉంచారు. కథ కాస్త సైడ్ ట్రాక్ పట్టినా, ఎంటర్‌టైన్‌మెంట్ కి మాత్రం లోటు రానివ్వలేదు. టెక్నికల్ గా బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. రథన్ సంగీతం బ్యాక్‌బోన్‌లా నిలిచింది. పాటలు హృద్యంగా ఉండటమే కాక, చిత్రీకరణ కూడా ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి.

చివరగా

నవ్వులు పంచే 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి'!

Tags:    

Similar News