బంజారాహిల్స్‌లో కుంగిన రోడ్డు - తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఇది హెచ్చరికగా భావించి రహదారుల సమగ్ర తనిఖీలు చేయాలంటూ ప్రజల డిమాండ్;

Update: 2025-08-05 10:50 GMT

హైదరాబాద్‌ నగరంలోని అప్‌స్కేల్‌ ఏరియా అయిన బంజారాహిల్స్‌లో సోమవారం ఒక ప్రధాన రహదారి అకస్మాత్తుగా కుంగిపోవడం కలకలం రేపింది. మహేశ్వరి ఛాంబర్స్‌ నుండి వచ్చినట్లు గుర్తించిన 10,000 లీటర్ల భారీ వాటర్‌ ట్యాంకర్‌ ఆ మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఘటనను కళ్లారా చూసిన ప్రత్యక్షసాక్షుల ప్రకారం, ట్యాంకర్‌ బరువును తట్టుకోలేక రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో అక్కడున్న డ్రైనేజీ లైన్‌ కూడా దెబ్బతింది. కుంగిపోయిన రోడ్డులో ట్యాంకర్‌ ముందుభాగం ఇరుక్కుపోవడంతో స్థానికులు, ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

GHMC (గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌) అధికారులు, పోలీస్‌ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దెబ్బతిన్న ప్రాంతాన్ని నిర్బంధించి ట్రాఫిక్‌ను మళ్లించారు. తక్షణమే మరమ్మతుల పనులు ప్రారంభించారు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, రోడ్డు దిగువన ఉన్న డ్రైన్‌లైన్‌ నిర్లక్ష్యంతో కాలక్రమేణా బలహీనపడిందని, అధిక బరువు వాహనాల రాకపోకలతో అది మరింత దెబ్బతిని అకస్మాత్తుగా కుంగిపోయిందని అనుమానిస్తున్నారు. నిన్న కురిసిన భారీ వర్షాల వల్ల కూడా రోడ్డు కుంగిపోయి ఉండొచ్చు అని అధికారులు అనుమానం వ్యక్త చేస్తున్నారు.అధికారులు ఈ విషయంలో పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి, సత్వరమే రోడ్డును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మేము ఎన్నోసార్లు రోడ్ల పరిస్థితి, డ్రైనేజీ సమస్యలపై ఫిర్యాదులు చేశాం, కానీ స్పందించలేదు అని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఘటన పెద్ద ప్రమాదం ప్రయాణికులకు పెద్ద ప్రమాదంగా ఉందని, అధికారులు బాధ్యత వహించి భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి, అని ఒక నివాసితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇటీవలి కాలంలో హైదరాబాద్‌ నగరంలో ఈ తరహా మౌలిక వసతుల వైఫల్యాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బంజారాహిల్స్ వంటి రహదారి రద్దీ ఎక్కువగా ఉండే, ఖరీదైన నివాస ప్రాంతాల్లో రోడ్ల నాణ్యతపై సమగ్ర సమీక్ష అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ ఘటన ప్రభుత్వానికి, GHMCకు హెచ్చరికగా మారాలని, నగరంలోని అన్ని ప్రధాన రహదారులను సాంకేతికంగా పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News