కమల్ హాసన్ – మోదీ భేటీకి ప్రాముఖ్యత
వైగై నది తీరంలోని సంగకాలపు నాగరికత ఆధారాలను ప్రధానికి జ్ఞాపికగా అందించిన కమల్;
కమల్ హాసన్ 2018లో "మక్కళ్ నీతి మయం (Makkal Needhi Maiam - MNM)" అనే పార్టీని స్థాపించారు. ఆయన రాజకీయ ఆవిర్భావం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం – అవినీతి రహిత పరిపాలన, సమాజం కోసం విలువల ఆధారంగా రాజకీయం చేయాలి అని భావించారు. MNM పార్టీ ద్వారా ఆయన తమిళనాడు ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించారు. ప్రజల సమస్యలపై చురుకుగా స్పందించే కమల్ హాసన్, విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు.
MNM పార్టీ అధ్యక్షులుగా కోయంబత్తూర్ నుంచి పోటీ చేసిన కమల్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.సామాజిక చింతన కలిగిన నాయకుడు డీఎంకే పార్టీ సహాయంతో కమల్ హాసన్ 2025 జూలై 25న రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడుకు చెందిన ఆయనను రాష్ట్రీయ ప్రగతిశీల కూటమి (ఇండియా బ్లాక్) తరపున రాజ్యసభకు నామినేట్ చేయడం, రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తిని కలిగించింది. ఇది కమల్ హాసన్ గారి రాజకీయ జీవితంలో ఒక కీలక మలుపు, జాతీయ స్థాయిలో ప్రజాప్రతినిధిగా ఆయనకు అధికారిక హోదా కల్పించారు.
రాజ్యసభ సభ్యుని హోదాలో తొలిసారి ఈ రోజు(ఆగస్టు 7) దేశ రాజధానిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిశారు. కమల్ హాసన్ పార్లమెంట్ సభ్యుడిగా పదవిలోకి వచ్చిన తర్వాత ఇదే వారి తొలి భేటీ కావడం విశేషం.
ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను కమల్ హాసన్ గారు 'X' వేదికగా పంచుకున్నారు. ఆయన పోస్టులో, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని కలిసిన గౌరవం నాకు లభించింది. తమిళనాడు ప్రజల ప్రతినిధిగా, ఒక కళాకారునిగా, వారి తరఫున కొన్ని ముఖ్యమైన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. అందులో ప్రధానంగా పురాతన కాలానికి సంబందించిన 'కీజది' కి అధికారిక గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలి అని అభ్యర్ధించినట్టు తెలియచేసారు.అలాగే, తమిళ నాగరికత వైభవాన్ని, తమిళ భాష శాశ్వత మహిమను ప్రపంచానికి చాటిచెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి గారిని కోరినట్టుగా కమల్ హాసన్ తెలిపారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ గారు 'కీజది' తవ్వకాల నేపథ్యంతో రూపొందించిన ఒక స్మారక చిహ్నాన్ని ప్రధానమంత్రి మోదీ గారికి బహుమతిగా అందించారు. ఇది వైగై నది తీరంలో సంగకాలం నాటికే చెందిన పట్టణ నాగరికతకు ఆధారాలు చూపుతున్న కీలక పురావస్తు తవ్వకాల ప్రాముఖ్యతను సూచిస్తోంది.
'కీజది' తవ్వకాలు, తమిళ నాగరికత ప్రాచీనతకు బలమైన ఆధారాలు దేశ ప్రధానికి బహుమతిగా ఇచ్చినందుకు దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ తవ్వకాల ప్రాముఖ్యతను గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం మరియు తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం మధ్య విభేదాలు నెలకొన్నాయి.కమల్ హాసన్ ఈ సమావేశం ద్వారా, తమిళ ప్రజల అభిప్రాయాలను, వారిలోని గౌరవభారాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు స్పష్టమవుతోంది. ఈ భేటీ రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రాధాన్యమైనదిగా భావించబడుతోంది.