20 నెలలలోనే హైదరాబాద్‌కు ప్రపంచ GCC హబ్ - సీఎం రేవంత్
తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యానికి దోహదం చేసే కీలక అడుగు - ప్రపంచ టీకా ఉత్పత్తిలో హైదరాబాద్ కీలక పాత్ర;
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి, అమెరికా ఔషధ దిగ్గజం ఎలి లిల్లీ (Eli Lilly) యొక్క నూతన సాంకేతిక–ఆవిష్కరణ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు యొక్క దూరదృష్టి, నిరంతర కృషి ఫలితంగా, కేవలం 20 నెలల్లోనే హైదరాబాద్‌ను ప్రపంచ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల (GCC) ప్రధాన కేంద్రంగా మలచగలిగామని గర్వంగా తెలిపారు.
ఇది సాధారణ కేంద్రం కాదు అని 'ఎలి లిల్లీ' సంస్థకు ఇది ప్రాణకేంద్రం పనిచేస్తుంది అన్నారు. సంస్థ యొక్క ముఖ్య కార్యకలాపాలు అన్ని ఇక్కడి నుంచే పనిచేస్తుంది అన్నారు. ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్త కార్యకలాపాలకు దారితీస్తూ, వాటిని ముందుండి నడిపిస్తూ, వేగవంతం చేస్తుంది అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ రైజింగ్ 2047 దిశలో, హైదరాబాద్‌లోని GCCల అభివృద్ధి రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన సీఎం వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా వేసే ప్రతి మూడు టీకాలలో ఒకటి హైదరాబాద్‌లోనే అభివృద్ధి చెయ్యబడినదో, లేదా తయారైనదో కావడం మనకు గర్వకారణం అని ముఖ్యమంత్రి ఉత్సాహంగా పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఈ కేంద్రం, ఎలి లిల్లీ యొక్క ఆధునిక సాంకేతిక సామర్థ్యాలను కీలక విభాగాల అంతటా సమన్వయం చేస్తూ, వేగవంతమైన ఆవిష్కరణలకు, మెరుగైన పనితీరుకు, మరియు రోగుల ఆరోగ్య ఫలితాల అభివృద్ధికి తోడ్పడనుంది. ఈ సదుపాయం స్థానిక ప్రతిభకు ఉద్యోగావకాశాలను కల్పించడమే కాకుండా, నగరంలోని బయోటెక్ పర్యావరణ వ్యవస్థను మరింత బలపరుస్తుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ – "ప్రపంచంలోని అగ్రశ్రేణి ఔషధ, బయోటెక్నాలజీ సంస్థల అత్యాధునిక సామర్థ్య కేంద్రాలకు హైదరాబాద్ ప్రధాన గమ్యస్థానంగా ఎదిగింది. దేశంలో లైఫ్ సైన్సెస్ రాజధాని హైదరాబాద్‌లో 2,000కి పైగా సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి అని తెలిపారు.
కృత్రిమ మేధస్సు (AI), ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తి ఇంజినీరింగ్ వంటి రంగాలలో దృష్టి సారించడం ద్వారా, ప్రపంచంలోని అత్యవసర ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను అందించడంతో పాటు, స్థానిక ప్రతిభకు విశాలమైన అవకాశాలను సృష్టిస్తుందని ఆయన అన్నారు.
2,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ సదుపాయంలో ఇప్పటికే 100 మంది నిపుణులను నియమించుకున్నామని, రాబోయే సంవత్సరాల్లో ఆ సంఖ్యను 1,500కి పెంచే ప్రణాళిక ఉందని సంస్థ వెల్లడించింది.
లైఫ్ సైన్సెస్ పరిశ్రమ విస్తరణకు, ప్రపంచ ఆరోగ్య శాస్త్ర సామర్థ్యాల మెరుగుదలకు పారదర్శకత, పురోగతి, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.