యువ ఖైదీలకు రాఖీలు కట్టిన హోంమంత్రి అనిత
చిన్న నేరాలకే జైలులో యువకులు… పెద్ద నేరస్థులు మాత్రం వెలుపల – అనిత ఆవేదన;
విశాఖపట్నంలోని సెంట్రల్ జైలులో ఈసారి రక్షాబంధన్ పండుగ ఎంతో ప్రత్యేకంగా జరిగింది. హోంమంత్రి వంగలపూడి అనిత ఈ సందర్భంగా 30 మందికి పైగా యువ ఖైదీలకు స్వయంగా రాఖీలు కట్టి, సోదరభావం, ప్రేమ, విశ్వాసం అనే విలువలను గుర్తు చేశారు. ఖైదీలకు మానసిక ధైర్యం నింపుతూ, మంచి మార్గంలో నడవాలని ప్రేరణనిచ్చారు.
హోంమంత్రి అనిత మాట్లాడుతూ,జీవితంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. గంజాయి వంటి మత్తు పదార్థాల్లో పడిపోవద్దు. బంగారు భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు అని హెచ్చరించారు. ఈజీ మనీ కోసం తప్పు మార్గం ఎంచుకుంటే, జీవితమే నాశనం అవుతుందని స్పష్టం చేశారు.
గంజాయి వాడకం, రవాణా వంటి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చిన్న నేరాలకే ఎక్కువగా యువకులు జైలుకి వస్తున్నారని, కానీ పెద్ద నేరస్థులు మాత్రం బయట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో డి-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
అలాగే, ఖైదీలు తయారు చేసే వస్తువులను అమ్మకం ద్వారా వారికి ఉపాధి కల్పించే విధానంపై కూడా చర్చించారు. ఖైదీల జీవితాల్లో మార్పు తీసుకురావడం, సమాజంలో తిరిగి మంచి స్థానంలో నిలిపే ప్రయత్నం చేయడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
వచ్చే సంవత్సరం మీరంతా మీ ఇళ్లలోనే రాఖీ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను అని వనిత ఖైదీలకు తెలిపారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం, యువత తప్పుదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అని మంత్రి హామీ ఇచ్చారు.