ఉత్తరాంధ్రలో వరద భీభత్యం
అల్లూరి జిల్లా పాడేరు, అనకాపల్లి జిల్లాల్లో రికార్డు వర్షపాతం - గొల్లప్రోలు మండలంలో అత్యధికంగా 55.2 సెం.మీ. వర్షపాతం – సుద్దగడ్డ వాగు ఉధృతం;
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాపాడేరులో 16.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో 15.5 సెంటీమీ. కే కోటపాడు మండలంలో 15 సెంటీమీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాలు నీటమునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
అల్లూరి జిల్లా చింతపల్లి, గిడుగుపాడు,పాడేరు మన్యం జిల్లాలో విస్తారంగా వర్షం కురుస్తోంది. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి నుండి ఎర్రమెర్లకువరకు వర్షం కురవడంతో అటు కూడా చెరువులు పొంగిపొర్లుతున్నాయి.
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఒడిశా వైపు నుండి వచ్చే నీటితో చెరువులు నిండిపోయాయి. చెరువులు పొంగిపొర్లడంతో ఇళ్లలోకి నీరు చేరింది. పంటలు, వ్యవసాయ భూములు నీటిలో మునిగిపోయాయి. అడవుల నుండి వచ్చే వర్షపు నీరు గ్రామాల్లోకి చేరడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో 55.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం వల్ల గొల్లప్రోలు లోని సుద్దగడ్డ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.దీంతో ప్రజలు రాకపోకల కోసం తాత్కాలిక మార్గాలపై ఆధారపడుతున్నారు. నీటితో మునిగిన రోడ్లపై పలు చోట్ల రవాణా కష్టాలు వస్తున్నాయి. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో దాదాపు 1000 ఎకరాల పంట నీటిలో మునిగిపోయింది.