అమిత్ షాకు అరుదైన రికార్డు!
6 సంవత్సరాలు 64 రోజులు పూర్తి చేసుకున్న అమిత్… ఇంకా కొనసాగుతూనే ఉన్న పదవీ ప్రయాణం;
కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారత రాజకీయ చరిత్రలో ఓ అరుదైన ఘనతను తన ఖాతాలోకి జమ చేసుకున్నారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం హోంమంత్రిగా కొనసాగిన నేతగా ఆయన రికార్డు నెలకొల్పారు. గతంలో ఈ ఘనత బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీకి దక్కగా, 2025 ఆగస్టు 5 నాటికి అమిత్ షా ఆ రికార్డును అధిగమించి చరిత్రలో తన స్థానం సాధించారు. ఈ రోజుతో ఆయన హోం మంత్రిగా 6 సంవత్సరాలు 64 రోజులు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం కూడా ఆయన అదే పదవిలో కొనసాగుతుండటంతో ఈ రికార్డు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇతర ప్రముఖ హోంమంత్రులతో పోలిస్తే అమిత్ షా సుదీర్ఘ కాలం ఈ పదవిలో కొనసాగుతున్నారు. గతంలో కాంగ్రెస్ నేత గోవింద్ వల్లభ్ పంత్ సుమారు ఆరు సంవత్సరాలపాటు హోం మంత్రిగా ఉన్నారు. బీజేపీ నేత రాజ్‌నాథ్ సింగ్ 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లపాటు ఈ బాధ్యతలు నిర్వహించారు. కానీ అమిత్ షా మాత్రం నిరంతరం పదవిలో కొనసాగుతూ, కీలకమైన నిర్ణయాలతో తన నాయకత్వాన్ని నిలబెట్టుకుంటున్నారు.
దేశ భద్రతా పరంగా అమిత్ షా తీసుకుంటున్న నిర్ణయాలు వినూత్నమైనవి, దృఢమైనవి. నక్సలిజం వంటి అంతర్గత తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో భద్రతా దళాలకు సాంకేతిక సామర్థ్యం, వ్యూహాత్మక మద్దతు అందిస్తూ నక్సల ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించారు.
ఇటీవల పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన "ఆపరేషన్ సింధూర్"లోనూ అమిత్ షా సైన్యానికి వ్యూహాత్మకంగా కీలక సూచనలు చేశారు. ఆయా సూచనలు భారత సైన్య విజయానికి దోహదపడటమే కాకుండా, దేశ భద్రత పరంగా సైనిక చర్యలకు మార్గనిర్దేశం చేశాయి. ఈ మేరకు ఆయన దృఢమైన నాయకత్వం మరోసారి చాటుకుంది.
2019లో అమిత్ షా తీసుకున్న చారిత్రిక నిర్ణయం – ఆర్టికల్ 370 రద్దు – భారత రాజ్యాంగ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. దీని ద్వారా జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగించబడింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా – జమ్ము & కశ్మీర్, లద్ధాఖ్ – విడదీంచడంతో దేశ సమగ్రతకు బలమైన బలస్థంభంగా నిలిచారు అమిత్ షా.
ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా, బీజేపీ ముఖ్య వ్యూహకర్తగా అమిత్ షా పేరు దేశవ్యాప్తంగా ఘనత పొందింది. పరిపాలనా నైపుణ్యం, భద్రతాపరమైన దృక్పథం, రాజకీయ ఆలోచనల్లో స్పష్టత కలిగిన నేతగా అమిత్ షా ఈ శాస్వత ఘనతను అందుకోవడం అనేది భారత రాజకీయాలపై ఆయన ప్రభావాన్ని నొక్కిచెబుతోంది.
ఈ మధ్య కాలంలో భారత రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా మరో అరుదైన ఘనత సాధించారు. జూలై 25, 2025 నాటికి ఎక్కువ కాలం భారత ప్రధానిగా ( 4,078 రోజులు) పనిచేసిన రెండో వ్యక్తిగా ఆయన నిలిచారు. గతంలో 1964 నుంచి 1977 మధ్య నిరంతరాయంగా దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా దివంగత ఇందిరా గాంధీ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన తొలి వ్యక్తిగా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నిలవగా, ఆయన తర్వాత ప్రస్తుతం ప్రధాని మోదీ రెండో స్థానంలో నిలిచారు.