‘ది ఫ్యామిలీ మేన్ 3’ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే... !
ఈ సిరీస్ నవంబర్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు.;
భారతీయ వెబ్‌సిరీస్‌లలో ప్రేక్షకుల మనసు గెలిచిన వాటిలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు దీని మూడో సీజన్ కోసం సినీ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మనోజ్ బాజ్‌పాయ్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా... రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఈ సిరీస్ సిద్ధమైంది. ఇటీవల ఒక ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడిన మనోజ్ బాజ్‌పాయ్ ఈ సిరీస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘పాతాళ్‌లోక్-2’లో అద్భుత నటనతో అందరినీ ఆకర్షించిన జైదీప్ అహ్లావత్ ఈ సిరీస్ మూడో భాగంలో నటిస్తున్నారు. ఆయన రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్‌లో అడుగుపెట్టినప్పటికీ... ఈ విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు. ఆయన పోషించే పాత్ర అత్యంత బలమైనదిగా ఉంటుందని.. కానీ ఆ పాత్ర గురించిన వివరాలను ఇప్పుడు బహిర్గతం చేయలేమని మనోజ్ స్పష్టం చేశారు. ఈ సిరీస్ నవంబర్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు. ఈ స్పై థ్రిల్లర్‌లో మరో ప్రముఖ నటుడు భాగస్వామ్యం కావడంతో అభిమానుల ఆసక్తి రెండింతలైంది.
ఓటీటీలో అత్యధిక వీక్షకులను సంపాదించిన సిరీస్‌గా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు రెండు సీజన్‌లతో విజయవంతంగా ముందుకు సాగిన ఈ యాక్షన్ థ్రిల్లర్, మూడో సీజన్‌తో మరోసారి ఆకట్టుకోవడానికి సన్నద్ధ మవుతోంది. ఈ భాగంలో జైదీప్ అహ్లావత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ‘సీజన్ 2’లో సమంత విలన్ పాత్రలో నటించి, తమిళ టైగర్స్ సైనికురాలిగా తన నటనతో అదరగొట్టారు.