ఓటీటీలోకి శర్వానంద్ 'మనమే' మూవీ
శర్వానంద్, కృతిశెట్టి జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'మనమే'. ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది. తాజా సమాచారం ప్రకారం.. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత ఏడాది జూన్‌లో థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సంపాదించింది.
శర్వానంద్ కామెడీ టైమింగ్, కృతిశెట్టితో అతడి కెమిస్ట్రీ ఆకట్టుకున్నా, రొటీన్ కథ కారణంగా భారీ విజయాన్ని సాధించలేకపోయింది. అయితే, ఓటీటీలో ఈ సినిమాపై మంచి స్పందన వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రంలో ఇంకా రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్, శివ కందుకూరి, ఆయేషా ఖాన్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ 'ఖుషి' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.
ఆరంభంలోనే ఓటీటీలో విడుదల కావాల్సిన ఈ చిత్రం.. నాన్ థియేట్రికల్ హక్కుల వివాదం కారణంగా ఆలస్యమైంది. హక్కులను కొనుగోలు చేసిన వారు చెల్లింపులు చేయకపోవడంతో, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ కోర్టును ఆశ్రయించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ వివాదం పరిష్కారమై సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి మార్గం సుగమమైందని తెలుస్తోంది.
విక్రమ్ (శర్వానంద్) నిర్లక్ష్యంగా జీవితం గడిపే యువకుడు. అతని ప్రాణ స్నేహితుడు అనురాగ్, అతని భార్య శాంతి ప్రమాదంలో మరణించడంతో, వారి కుమారుడు ఖుషిని సంరక్షించే బాధ్యత విక్రమ్ తీసుకుంటాడు. శాంతి స్నేహితురాలు సుభద్ర (కృతిశెట్టి) కూడా ఈ బాధ్యతను పంచుకుంటుంది. ఖుషికి తల్లిదండ్రుల అనుభూతి కలిగించేందుకు వీరు చేసిన ప్రయాణం ఎలా సాగింది? ఈ క్రమంలో విక్రమ్, సుభద్ర మధ్య ప్రేమ ఎలా కలిగింది? సుభద్రతో కార్తీక్ (శివ కందుకూరి) ఉన్న సంబంధం ఏమిటి? అనే అంశాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి.
ఈ చిత్రం దాదాపు పది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదలైంది. థియేట్రికల్ రన్‌లో 22 కోట్లకు పైగా గ్రాస్, 11 కోట్ల షేర్ కలెక్షన్లు సాధించింది. మొత్తంగా, నిర్మాతలకు కోటి రూపాయల వరకు లాభాలు వచ్చినట్లు సమాచారం.