డిజిటల్ రంగంలో ఉత్తమనటిగా సామ్ !

‘సిటాడెల్’ సిరీస్‌లో ప్రియాంక చోప్రా నటనతో పోలిస్తే, భారతీయ రీమేక్ వెర్షన్‌లో సమంత ప్రదర్శన మరింత గుర్తింపు పొందిందని చెప్పవచ్చు.;

By :  K R K
Update: 2025-03-21 06:34 GMT

అందాల సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూనే ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సిరీస్‌లో ఆమె సంక్లిష్టమైన స్టంట్‌లతో పాటు అద్భుతమైన నటనను కనబరిచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ కృషి ఫలితంగా.. ఆమె నటనకు గాను ఓటీటీ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. అసలు ‘సిటాడెల్’ సిరీస్‌లో ప్రియాంక చోప్రా నటనతో పోలిస్తే, భారతీయ రీమేక్ వెర్షన్‌లో సమంత ప్రదర్శన మరింత గుర్తింపు పొందిందని చెప్పవచ్చు.

రాజ్ అండ్ డికె దర్శకత్వంలో రూపొందిన ‘సిటాడెల్: హనీ బన్నీ’లో వరుణ్ ధావన్ కూడా కీలక పాత్రలో కనిపించాడు. ఈ వెబ్ సిరీస్ లోని తన నటనకు గాను ‘న్యూస్18 షోషా రీల్ అవార్డ్స్ 2025’ కార్యక్రమంలో సమంత అవార్డు అందుకున్న క్షణంలో ఆమె కళ్లలో సంతోషం స్పష్టంగా కనిపించింది. తన కఠోర శ్రమకు తగిన ప్రతిఫలం లభించినందుకు ఆమె ఆనందంతో పొంగిపోయింది.

ఈ అవార్డు కోసం ‘హీరామండి’ నటీమణులైన మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితీ రావ్ హైదరీలతో పాటు ‘కిల్లర్ సూప్’లో నటించిన కొంకణా సేన్ శర్మ కూడా నామినేషన్లలో ఉన్నారు. అయినప్పటికీ.. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు సమంతకే దక్కింది. అమెజాన్ ఓటీటీ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సిరీస్‌లో సమంత ఒక శక్తివంతమైన ఏజెంట్‌గా.. ప్రమాదకర రహస్య మిషన్‌లో నటించి అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో అలరించింది. ఈ సిరీస్‌లో ఆమె భర్త పాత్రలో వరుణ్ ధావన్ కనిపించాడు.

ఈ ఏడాది సమంత చాలా బిజీగా గడిపింది. ప్రస్తుతం ఆమె నిర్మాతగా ‘మా ఇంటి బంగారం’ చిత్ర నిర్మాణంపై దృష్టి పెట్టింది. అదే సమయంలో రాజ్ అండ్ డికె నిర్మిస్తున్న ‘రక్త్ బ్రహ్మండ్’ చిత్రంలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. సినిమా మరియు డిజిటల్ వినోద రంగాల్లో షోషా రీల్ అవార్డ్స్ ప్రదానం చేయడం విశేషం. సమంత ఈ రెండు రంగాల్లోనూ తన ప్రతిభను నిరూపించుకుంది.

Tags:    

Similar News