ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ‘లైలా’
విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లైలా’ భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలై నిరాశపరిచింది. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విశ్వక్ తొలిసారిగా లేడీ గెటప్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. టీజర్, ట్రైలర్ లాంటి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచినా, కథ, కథనాల పరంగా ప్రేక్షకుల మనసు గెలుచుకోలేకపోయింది.
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశాజనకమైన ఫలితాన్ని నమోదు చేసింది. అయితే, థియేటర్లలో సక్సెస్ అందుకోలేకపోయినా, ఓటీటీలో మాత్రం 'లైలా' ఆడియన్స్ ను మెప్పిస్తుందనే నమ్మకంతో ఉంది టీమ్. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వేదికగా మార్చి 7 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కి జోడీగా ఆకాంక్ష శర్మ నటించింది. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.