బేసిల్ జోసెఫ్ మరో సూపర్ హిట్ మలయాళ చిత్రం ఓటీటీలోకి !
‘జయజయజయహే, గురువాయూర్ అంబళ నడయిల్, సూక్ష్మదర్శిని లాంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడయ్యాడు మలయాళ దర్శకుడు, హీరో బేసిల్ జోసెఫ్. అతడు నటించిన మరో సూపర్ హిట్ చిత్రం ‘పొన్మాన్’ సైతం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకూ అందుబాటులోకి రాబోతోంది. డార్క్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ‘పొన్మాన్’ చిత్రం ఈ ఏడాది జనవరి 30 న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. ప్రముఖ నవల ‘నాలంచు చెరుప్పుకార్’ ఆధారంగా రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేషమైన ప్రశంసలు అందుకుంది.
బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అత్యద్భుతమైన వసూళ్లను సాధించింది. ఇప్పుడు, ‘పొన్మాన్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది, కానీ ఈసారి ఓటీటీ ద్వారా. మార్చి 14, 2025 నుంచి ఈ జియో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ దిగ్గజం జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. తమ ఎక్స్ ఖాతాలో వారు పోస్టు చేస్తూ .. ఈ గోల్డెన్ మ్యాన్ మెరుస్తాడు! పొన్మాన్ మార్చి 14 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది!" అని తెలిపారు.
పీపీ అజేశ్ అనే వ్యక్తి ఓ ప్రత్యేకమైన బంగారు ఆభరణాల వ్యాపారం నిర్వహిస్తుంటాడు. వివాహ వేడుకల్లో వధువు కుటుంబానికి బంగారు ఆభరణాలను ముందుగా ఇచ్చి, పెళ్లి సమయంలో తమకు అందే నగదు, కానుకల రూపంలో తిరిగి చెల్లించాలి అనే ఒప్పందంపై ఈ వ్యాపారం సాగుతుంది. అయితే, అజేశ్ ఒకసారి 25 సవర్ల బంగారం ఇచ్చిన కుటుంబం నుండి తాను అంచనా వేసినంత మొత్తాన్ని పొందలేకపోతాడు. ఈ సంఘటన అతని జీవితాన్ని మలుపుతిప్పుతుంది. తన బంగారాన్ని తిరిగి సంపాదించేందుకు సాగించే ప్రయత్నంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలు అతనికి ఎదురవుతాయి.
సజిన్ గోపు, లిజోమోల్ జోస్, దీపక్ పరంబోల్, సంద్యా రాజేంద్రన్, రాజేష్ శర్మ, ఆనంద్ మన్మధన్, మిధున్ వేణుగోపాల్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జ్యోతిష్ శంకర్ దర్శకత్వం వహించగా, వినాయక అజిత్ నిర్మించారు. ఈ సినిమా ‘అజిత్ వినాయక ఫిలిమ్స్’ బ్యానర్‌లో నిర్మితమైంది. మార్చి 14న ‘పొన్మాన్’ ఓటీటీలో సందడి చేయనుంది ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ చిత్రాన్ని మిస్ కాకుండా జియో హాట్ స్టార్ లో వీక్షించండి.