ప్రజల గళం – ఆర్. నారాయణ మూర్తి!

మల్లంపేట నుంచి మిలియన్ల హృదయాల వరకు ప్రయాణం - రైతు–కార్మికుల సమస్యలే ఆయన సినీ కథలు - అవార్డులు కన్నా ప్రజల చప్పట్లు ప్రాధానం;

Update: 2025-08-21 09:12 GMT

ఆర్. నారాయణ మూర్తి గారు 1954 డిసెంబర్ 31న ఆంధ్రప్రదేశ్‌లోని మల్లంపేట గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుంచే నాయకత్వ గుణాలు కలిగిన ఆయన, కాలేజీలో ప్రెసిడెంట్, రిక్షా యూనియన్ నాయకుడు, ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీగా పనిచేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి, కష్టపడి సినీ రంగంలో స్థానం సంపాదించారు.

మొదట చిన్న పాత్రలతో సినిమాల్లోకి వచ్చి, తర్వాత మహేష్ బాబు అన్న రమేష్ బాబు నటించిన “నీడా” సినిమాలో రెండో హీరోగా నటించారు. తర్వాత తన స్వంత బ్యానర్ “స్నేహ చిత్ర పిక్చర్స్” స్థాపించి, 1986లో “అర్ధరాత్రి స్వాతంత్ర్యం” సినిమాతో నటుడు, దర్శకుడు, నిర్మాతగా గుర్తింపు పొందారు.నారాయణ మూర్తి గారి సినిమాలు ఎప్పుడూ ప్రజల సమస్యల చుట్టూ తిరుగుతాయి. రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, చిన్నవారికి సంబంధించిన సమస్యలను తెరపై చూపిస్తూ వచ్చారు. “ఎర్ర సైన్యం”, “ఒరేయ్ రిక్షా”, “ధండోరా” వంటి చిత్రాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. “ధండోరా” సినిమాకు నంది అవార్డు కూడా దక్కింది.

ఇప్పుడు ఆయన కొత్త సినిమా “యూనివర్శిటీ” ఆగస్టు 22న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఆర్.నారాయణ మూర్తి గారు మాట్లాడుతూ,ఇందులో విద్యా వ్యవస్థలో జరిగే పేపర్ లీక్, అవినీతి వంటి సమస్యలను చూపిస్తున్నారు. విద్య ప్రైవేటీకరణ, పరీక్షలలో అవకతవకలు విద్యార్థుల భవిష్యత్తును ఎలా దెబ్బతీస్తున్నాయో ఈ సినిమాలో స్పష్టంగా చూపించినట్టు తెలియచేసారు. ఆయన మాటల్లో – “కాపీ అనేది బాంబు కన్నా ప్రమాదకరం. అది జ్ఞానాన్ని నాశనం చేస్తుంది” అన్నారు.

నారాయణ మూర్తి గారు సినిమా హాళ్ల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న నిర్మాతలకు Percentage system లాభదాయకమని అన్నారు. టికెట్ ధరలు పెరుగుతున్నందువల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోతుందనే ఆందోళనను కూడా వ్యక్తం చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాయమవుతూ పెళ్లి హాళ్లుగా మారిపోతున్నాయనే బాధ నారాయణ మూర్తి గారు వ్యక్త పరిచారు.

చంద్రబాబు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి, చిరంజీవి వంటి ప్రముఖులు ఆయనను రాజకీయాల్లోకి ఆహ్వానించినా, ఆయన ఆ ఆఫర్లను తిరస్కరించారు. తనకు రాజకీయ పదవులు అవసరం లేదని, ప్రజల కోసం సినిమాల ద్వారానే సేవ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆర్. నారాయణ మూర్తి గారు వాణిజ్య సినిమాలకన్నా సామాజిక సినిమాలకే ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజల సమస్యలనే కథలుగా ఎంచుకుని, వాటిని నిజాయితీగా తెరపై చూపిస్తారు. అందుకే ఆయనను “పీపుల్స్ స్టార్” అనే పిలుపుతో తెలుగు చిత్రసీమ ఆర్.నారాయణ మూర్తి గార్ని గౌరవిస్తుంది.

Tags:    

Similar News