విశాఖను సినిమా హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : గంటా శ్రీనివాసరావు

విశాఖపట్నాన్ని సినిమా నిర్మాణానికి ఒక ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచన అని గంటా శ్రీనివాసరావు తెలిపారు.;

By :  K R K
Update: 2025-04-14 04:35 GMT

రీసెంట్ గా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తిమ్మాపురంలో నిర్మాణంలో ఉన్న ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నాన్ని సినిమా నిర్మాణానికి ఒక ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు.

క్లబ్‌గా మాత్రమే కాకుండా.. ఫిల్మ్ టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా ఈ కల్చరల్ సెంటర్ పనిచేస్తుందని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది నిర్మాతలు, దర్శకులు విశాఖపై ఆసక్తి చూపుతున్నారని గంటా పేర్కొన్నారు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విశాఖలో స్టూడియో ఏర్పాటు చేయాలన్న ఆసక్తి వ్యక్తం చేశారని కూడా గంటా చెప్పారు.

అయితే ఇటీవల కల్చరల్ సెంటర్‌లో తీసుకున్న ఒక నియమంపై గంటా విమర్శలు గుప్పించారు. కమిటీ మెంబర్ల కుటుంబ సభ్యులు వారే వారసులుగా నియమించ బడతారన్న నిబంధన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వాల్టేర్ క్లబ్, గోల్ఫ్ క్లబ్, సెంచరీ క్లబ్ వంటి పురాతన క్లబ్‌లలో ఇలాంటి వివాదాస్పద నియమాలు ఉండవని అన్నారు.

ఒరిజినల్‌గా తోట్లకొండలో ఫిల్మ్ కల్చరల్ సెంటర్ కోసం కేటాయించిన 10 ఎకరాల భూమిని పురావస్తు శాఖ అభ్యంతరాల వల్ల ప్రభుత్వం తిరిగి తీసుకున్నదని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లతో చర్చలు జరిపి, కేంద్రానికి ప్రత్యామ్నాయ భూమిని కేటాయించే విషయంలో నిర్ణయం తీసుకుంటామని గంటా చెప్పారు.

Tags:    

Similar News