మెగాస్టార్ మాస్ టైటిల్ తో విక్రమ్ సినిమా
విక్రమ్ లేటెస్ట్ గా తమిళంలో ‘వీర ధీర సూరన్ పార్ట్ 2’ తో పాన్ ఇండియన్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.;
సౌత్ ఇండస్ట్రీలో ప్రయోగాలకు పెట్టింది పేరు చియాన్ విక్రమ్. ప్రతిసారి భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే విక్రమ్ .. లేటెస్ట్ గా తమిళంలో ‘వీర ధీర సూరన్ పార్ట్ 2’ తో పాన్ ఇండియన్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా మార్చి 27న విడుదల కానుంది.
తెలుగులో ఈ సినిమాకు "కాళి" అనే మాస్ అప్పీల్ ఉన్న టైటిల్‌ను ఖరారు చేయడం ఆసక్తికరంగా మారింది. ఎయిటీస్ లో ఐవీ శశి దర్శకత్వంలో ఇదే టైటిల్‌తో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ మల్టీస్టారర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అదే టైటిల్ ను విక్రమ్ సినిమాకు పెడుతుండడం విశేషం. ఎన్వీఆర్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది.
ఈ చిత్రానికి ‘చిన్న’ ఫేమ్ ఎస్.యు. అరుణ్ కుమార్ డైరెక్టర్. ఇందులో విక్రమ్ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. కిరాణా కొట్టు యజమానిగా, అలాగే గ్యాంగ్‌స్టర్‌గా. సినిమా మొత్తం విక్రమ్ మాస్ కోణాన్ని పతాక స్థాయిలో ఆవిష్కరించబోతున్నాడు దర్శకుడు. ఈ చిత్రంలో ఇంకా ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషార విజయన్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.